calender_icon.png 27 October, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడితనూర్ రాతిపుటల్లో రాసిన చరిత్ర

15-05-2024 12:05:00 AM

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఎడితనూర్ గ్రామాన్ని చూడ్డానికి వెళ్లినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుంచి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో ఇది పలు చారిత్రిక సందేహాల్ని పెంచింది. ఎడితనూర్ గోదావరి నది, ఉపనది మానేరుకు పిల్ల నదులైన వాగులో ఒకటైన నక్కవాగు ఒడ్డున ఉంది. ఇప్పుడున్న ఎడితనూర్ గ్రామానికి ఉత్తరాన కొండల గుంపు ఉంది. ఆ కొండల్లో తూర్పు దిక్కున ఎత్తయిన బండలతో కూడిన ప్రాకారం లాంటిది ఉంది. లోపలికి దారి చేసుకుని వెళితే గుట్ట అంచున తూర్పువైపు ఒక పడిగెరాయిలో లోపలివైపు రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రిత శిలాశ్రయం మధ్య శిలాయుగాల నాటిదిగా తెలుస్తోంది.

ఆ చిత్రాలలో వేదిలో ఉన్న ఆదిమానవుల చేతుల్లో వలరి, రాగోల వంటి పనిముట్లు బరిసె, వలలున్నాయి. మూపురాలున్న ఎద్దులు, ఆవులు, ఎడ్లబండి, బండి కిరువైపుల ఆవు, ఎద్దు, ఆవుదూడ, తాబేలు బొమ్మలు కన్పిస్తున్నాయి. మరికొన్ని రాతి పెచ్చులూడి వర్షానికి తడిసి పాడైపోయి తేటగా కన్పించడం లేదు. ఈ బొమ్మల వల్ల అప్పటి మనుషులు, జంతువులను మచ్చిక చేసుకుని ఉంటారని వేట, వ్యవసాయాలు తెలిసిన వారై ఉంటారని, ప్రాచీనులనీ తెలుస్తున్నది. ఈ చిత్రిత శిలాశ్రయానికి కొంచెం వెనుక పడమరగా లోపలికి ఒక గుహ ఉంది. అందులో గంటు బొమ్మలు ఫ్రెంచిలో పెట్త్రోగ్లెఫ్స్ అని పిలుస్తారు. అవి మూడు దిక్కులా ఉన్నాయి. ఈ తొలువుడు బొమ్మల్లో పుల్లగీతల వంటి ఆకృతిలో మనుషులు, చేతి ఆకారాలు, గణిత సంబంధమైన అనేక రూపాలున్నాయి. అయితే, ప్రపంచంలోని అనేక ఆదిమానవుల ఆవాసాల్లో ఇటువంటి గంటు బొమ్మలు అగుపిస్తుంటాయి. మన దేశంలో లడఖ్‌లో, గోవా ఉస్గరిమల్, తమిళనాడు పెరుముక్కల్, కేరళ ఎడక్కల్‌లోనూ ఈ గంటు బొమ్మలున్నాయి. ఇవన్నీ ఆదిమానవుల ప్రతీకాత్మక రేఖారూప భాషలు. గుహలోని రాక్ కార్‌వింగ్స్ మాత్రమేకాక బయట గుట్టలమధ్య లోయలో మరోచోట మరొక గంటు బొమ్మల శిల ఉంది. దానిమీద రేఖాకృతులు సంక్లిష్టంగా ఉన్నాయి.

ఈ ఆదిమానవుల ఆవాసాల నుండి కొంచెం పడమరగా ముందుకుళితే  30, 40 అడుగుల ఎత్తున్న ఏటవాలు కొండగుహలలో చౌడమ్మ తల్లి వెలసింది. అమ్మ దేవతల ఆరాధనలకు ప్రతీక ఈ చౌడమ్మ దేవత. ఆమె పేరు మీదే ఈ గుట్ట చౌడమ్మ గుట్ట అయింది. ఈ తల్లి గిరిజనుల దేవతే. తర్వాత ఎవరో దుర్గ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుంది. ఇక్కడ ఏటేటా జాతర చేస్తారు. ఈ గుహాలయం పక్క మరొక సన్నని దోనెలో బైరవుని(బయ్యన్న) విగ్రహం ఉంది. ఈ శిల్పాన్ని బట్టి 5,6 శతాబ్దాల కిందటిది అనిపిస్తుంది. చౌడమ్మ, బయ్యన్నల గుళ్ల ముందరి విశాలమైన వేదిక వంటి బండ మీద కప్పులేని మంటపం ఒకటి ఉంది. పడమట శివాలయంగా మార్చబడ్డ ఒక రాతిగూడు ఉంది. లోపల రాష్ట్ర కూటుల నాటి పానపట్టంపై శివలింగం, బయట మెడ తెగిపోయినా ఇసుకరాతి నంది ఆకారం ఉన్నాయి. ఆ పక్కనే చిన్న జలాశయం. పడమటి వైపు గుట్ట దిగబోతుంటే ఏదుల బండగా పిలువబడే నీటి చెలిమె సొరికె ఉంది.

దాంట్లోంచి ప్రవహించే నీటితో అక్కడొక రైతు రెండు ఎకరాలు పండించుకుంటున్నాడు. మిగిలిన నీరు కొండదిగి కట్టుకాలువ ద్వారా చెరువులోకి పోతున్నది. ఆ పొలం దాటి గుట్టల నడుమ లోయలోకి ప్రవేశించగానే ఎదుట మూడు రాళ్ల వరుస గుండు కన్పిస్తుంది. అదే గద్ద గుండు దీని గురించే కౌశీ పాండ్యన్ తన పుస్తకం మరుగున పడ్డ వారసత్వంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ గుండుకు పడమటి వైపు ఎనుపోతు ఆకారం(గీత రూపంలో) చెక్కి ఉంది. ఈ మహిషం బొమ్మ ఇక్కడ వేలాది ఏళ్లుగా జీవించి రాజ్యాల నేలిన మహిష గణం టోటెం, ఒక జాతి చిహ్నం. ఆదిలాబాద్‌లో భైంసా వంటి గ్రామాలైనా, మన ఊర్లలోని మైసమ్మలైనా మహిషకలు ప్రతినిధులే కదా! 

ఏన్సియట్ సొసైటీ అనే పుస్తకంటో రచయిత మోర్గాన్ జాతుల పేర్లు ఆయా జాతుల చిహ్నాలనుబట్టి వచ్చాయని, ఈ పేర్లన్నీ పక్షులు, జంతువులవిగానే ఉన్నాయని చెబుతూ, ఆదిమ సమాజాలు ఆటవిక దశలో తమకు పక్షినో, జంతువునో తమ గుర్తు(టోటెం)గా పెట్టుకునే వారంటూ, ఆ గుర్తులతోనే ఆయా గణసముదాయాలన్నీ గుర్తించబడ్డాయనీ రాశారు. ఎడితనూరు గుట్టల వరుస చౌడమ్మ గుట్టలనుండి సిద్ధేశ్వరుని గుట్టవరకు 6 గుట్టలుగా విస్తరించి ఉంది. చౌడమ్మ గుట్ట, దేవతల కుచ్చె, వెంకన్న గుట్టల మధ్య గద్ద గుండు ఉంది. దానికి తూర్పు, పడమరలుగా విస్తరించిన విశాలమైన లోయను ఏనుగుల లొద్ది అని పిలుస్తారు. ఈ లోయలో రాజుల కాలంలో ఏనుగుల సంత జరిగేదని పెద్దలు చెబుతుంటే విన్నామని మాకు గైడ్‌గా వచ్చిన ఎం.నరేందర్ చెప్పారు. ఏనుగుల లొద్దిలో కొంత దూరంలో ఒక రింగింగ్ రాక్ లేదా మ్యూజికల్ స్టోన్ ఉండేదట. అది తర్వాత కాలంలో క్వారీ పనుల వల్ల పాడైపోయిందని, దానిమీద నిలబడి రాయిని తొక్కుతూ ఊపితే చప్పుళ్లొచ్చేవని ఆయన వివరించారు. పూర్వం ఒంటరిగా ఉన్న రాయసగాండ్రు రాయిని ఊపి పుట్టించిన నాదంతో వారకాంతలను తమ ఏకాంత సేవలకు రమ్మని పిలుచుకునే వారట. దానిని గ్రామస్తులు లంజగుండు అని పిలుస్తారు. ఇది ఒకప్పటి ఆదిమానవులు, ఆపై గిరిజనులు వార్తలు పంపుకునే తుడుం వంటి రాతివాద్యమే. ఆదిమానవుల ఆవాసాలున్న ఇట్లాంటి రింగింగ్ స్టోన్స్ గల అనేక ప్రాంతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి.

ఇంకా ఇక్కడ ఆ లోయ పరిసరాల్లో పాటిగడ్డలు(పాత ఊరి దిబ్బలు) రెండు చోట్ల కనిపించాయి. అక్కడ మొద్దు పెంకలు, రాతి పనిముట్లు దొరికాయి. నాలుగైదు రక్కసి గూళ్లు(సిస్త్‌లు) కొత్తరాతి యుగపు ఆనవాళ్లుగా మిగిలి కనిపించాయి. ఆ పక్కన చిన్నగుట్ట, గుట్టకొక గుహ. ఆ గుహలో వెంకన్నగా పిలువబడే రెండు చేతుల దేవుడు, కుడి పక్కనే ఒక స్త్రీ మూర్తి ఉబ్బెత్తు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. దానికున్న ద్వారం చౌడమ్మ గుడికున్న మాదిరే చిన్నదిగా ఉంది. పరిశీలనగా చూస్తే ఆ దేవుడి చేతిలో శంఖుచక్రాలు లేవు. పలమో, తామర మొగ్గో ఉన్నట్టుగా ఉంది. ఏదైనా, జైనయక్షిణులై ఉండొచ్చు! అక్కడికి దగ్గరలో రెండు నాగయక్షిణుల బొమ్మలు దొరికాయి. ఇక్కడున్న గుహాలయాల్లో మరొకటి సిద్ధేశ్వరుని గుట్టపై ఉంది. ఇప్పుడా గుడిలో శివలింగం లేదు. ముస్లింల సమాధి రాయొకటి, ఊదు పాత్రలు ఉన్నాయి. రాజులు మారినప్పుడల్లా వారి  మతాధిపత్యాలు కూడా మరిపోతాయి, దేవుళ్లు కూడా అనిపించింది, చూస్తుంటే!

ఎడితనూరు గ్రామానికి వాయివ్యంన ఉన్న చెరువుకు అంచున జంగిడి గుళ్లుగా పిలువబడే చోట రెండు వీరగల్లున్నాయి. ఇద్దరు గిరిజన వీరుల, (స్త్రీ పురుషుల) వీరగల్లులలో విలమ్ములు, గొడ్డలి ఆయుధాలున్నాయి. తలకట్టు, ఆభరణాలు గిరిజన సంప్రదాయాలే. మరొక వీరగల్లు 6,7 శతాబ్దాల కాలం నాటి ఆహార్యం ధరించిన వీరుని స్మారక శిలగా ఉన్నది. జంగిడి గుళ్లు అనగానే మా ఊళ్లో మా చిన్నప్పుడు బలాదూరుగా తిరిగే పిల్లల్ని ఏమిరా! మిమ్మల్ని జంగిడి కొదిలిన్రా అనేవాళ్లు. జంగిడికి విడవడం అంటే జన్నె(యజ్ఞం) కొదిలిన అర్థంలో దేవుడికి అంకితం చేసినట్టా లేక జంగిడి అంటే జంగల్(అడవి) అనే అర్థంలోనా? ఆలోచించాల్సిన మాటే!

చరిత్రలో కొత్త అధ్యాయం..

ఎడితనూరు వేలయేళ్లుగా వర్థిల్లిన గిరిజన రాజ్య కేంద్రమని, పాతరాతి యుగం నుండి ఆధునిక రాజ్యాలదాకా చారిత్రిక కాలాన్ని తనలో దాచుకుని రాతిపుటల్లో రాసుకున్నదని ఈ ఊరిని సందర్శించిన వాళ్లకెవరికైనా అనిపిస్తుంది. ఈ ఊరిలో ఎక్కడా శాసనాలు లభించలేదు. ఊరికి దక్షిణాన చెరుకు తోటలో ఒక శిథిల దేవాలయం బయటపడింది. ఆలయం ద్వారబంధం మీద వేణువు ఊదుతున్న కృష్ణుడు, ఇరువైపుల గోపికలు, గోవులు అందంగా చెక్కబడి ఉన్నాయి. అంతరాళం పూర్తిగా తవ్వేయబడి ఉంది. ఆ ద్వారానికి ఆరాకుల పువ్వు చెక్కబడి ఉంది. ఇట్లాంటి చిహ్నాలే ఉన్న ఆలయాలు రాష్ట్రకూటుల కాలం నాటివని, వర్గల్‌లో కూడా ఇట్లాంటి గుర్తులున్నాయని మా గురువు విరువంటి గోపాలకృష్ణ(కొలనుపాక) చెప్పారు. అట్లే ఎడితనూరు గురించి 50 ఏళ్ల కిందటే సంగనభట్ల నరహరి పరిశోధించి వివరాలు రాసిన ఆయన డైరీలలోని విషయాలు వెల్లడైతే భారతదేశం చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా ఎడితనూరు లిఖితమవుతుంది.

శ్రీరామోజు హరగోపాల్

వ్యాసకర్త సెల్: 9949498698