calender_icon.png 18 October, 2024 | 1:16 PM

చారిత్రక తప్పిదం

27-07-2024 04:51:25 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఘోరం.. ప్రాజెక్టును కట్టిందే కమీషన్ల కోసం

తప్పు చేసిన మీరే అక్కడి వెళ్లి వరద నీటిని చూపించి నీటిని వృథాగా వదిలేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. పాలమూరు మీద రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరం కొత్త ఆయకట్టు రాలేదు. సీతారామసాగర్ కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేస్తే వచ్చిన ఆయకట్టు సున్నా. గత పదేళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల రూ.1.81 లక్షలకోట్లు ఖర్చు చేస్తే వచ్చింది నామ మాత్రపు ఆయకట్టు మాత్రమే. కాళేశ్వరంపై ఆర్భాటం చేసి అందరికీ టూరిజం స్పాట్‌లా చూపించారు. అప్పుడు పిక్నిక్‌కు వెళ్లినట్లే ఇప్పుడూ వెళ్లారు. 50 వేల మందితో పంపులను ఆన్ చేస్తామని అనేందుకు కేటీఆర్‌కు సిగ్గుండాలి. ఆయన పేరును గోబెల్స్‌గా మార్చాలి. మీరు చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణ చెప్పాలి. తుమ్మడిహెట్టి అయితే ఒకే ఒక లిఫ్టుతో ఎల్లంపల్లి నిండేది. బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డ గుండెకాయ అంటున్నారు. అదే ఇప్పుడు కూలిపోయింది. ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్, సాగునీటి మంత్రిగా చేసిన హరీష్‌రావు కాకుండా ఇప్పుడు కేటీఆర్ వచ్చి కాళేశ్వరంపై మాట్లాడటం హాస్యాస్పదం.

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): దేశ చరిత్రలో ఘోర తప్పిదం ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమేనని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇది పూర్తిగా కమీషన్ల కక్కుర్తి తప్పితే మరోటి కాదని ఆరోపించారు. కేసీఆర్ అండ్ కంపెనీ ఇరిగేషన్ సెక్టార్‌ను సర్వనాశనం చేసిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా దెబ్బకొట్టిందని ధ్వజమెత్తారు. అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని రూ.95 వేల కోట్లు కాళేశ్వరం కోసం ఖర్చు చేసి  సాగులోకి తెచ్చిన ఆయకట్టు 93 వేల ఎకరాలు మాత్రమేనని అన్నారు. ఇప్పటికే ఏటా కాళేశ్వరంపై రూ.15 వేల కోట్లను అసలు, వడ్డీ కోసమే చెల్లిస్తున్నామని, పంపులన్నీ నడిస్తే మరో రూ.10 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిపారు.

ప్రాజెక్టు మొత్తం పూర్తయితే వడ్డీ చెల్లింపే ఏడాదికి రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. శుక్రవారం జలసౌధలో మీడియా సమావేశంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం తప్పిదాలను వివరించారు. గత సర్కారు సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి తప్పు చేసి ఉండరని ధ్వజమెత్తారు. ‘తప్పు చేసిన మీరే అక్కడికి వెళ్లి వరద నీటిని చూపించి నీటిని వృథాగా వదిలేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. పాలమూరు మీద రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరం కొత్త ఆయకట్టు రాలేదు.

సీతారామసాగర్ కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేస్తే వచ్చిన ఆయకట్టు సున్నా. గత పదేళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కక్కుర్తి వల్ల రూ.1.81 లక్షలకోట్లు ఖర్చు చేస్తే వచ్చింది నామ మాత్రపు ఆయకట్టు మాత్రమే. కాళేశ్వరంపై ఆర్భాటం చేసి అందరికీ టూరిజం స్పాట్‌లా చూపించారు. అప్పుడు పిక్నిక్‌కు వెళ్లినట్లే ఇప్పుడూ వెళ్లారు. 50 వేల మందితో పంపులను ఆన్ చేస్తామని అనేందుకు కేటీఆర్‌కు సిగ్గుండాలి. మీరు చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణ చెప్పాలి. తుమ్మడిహెట్టి అయితే ఒకే ఒక లిఫ్టుతో ఎల్లంపల్లి నిండేది. బీఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డ గుండెకాయ అంటున్నారు. అదే ఇప్పుడు కూలిపోయింది. ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్, సాగునీటి మంత్రిగా చేసిన హరీష్‌రావు కాకుండా ఇప్పుడు కేటీఆర్ వచ్చి కాళేశ్వరంపై మాట్లాడటం హాస్యాస్పదం’ అని దుయ్యబట్టారు. 

అంతా నా ఇష్టం అన్నట్లుగా కేసీఆర్ తీరు

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ సొంత డిజైన్, సొంత నిర్మాణం.. అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని ఉత్తమ్ అన్నారు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ వద్ద పెద్ద శబ్దం వచ్చి బరాజ్ కుంగిపోయిందని తెలిపారు. ‘ప్రాజెక్టు మొదలుపెట్టింది వారే.. పూర్తి చేసింది వారే.. కుంగినప్పుడు కూడా వారే అధికారంలో ఉన్నారు. ప్రాజెక్టు మొత్తం బ్లాక్ 6 ఫీట్లు కిందకి కుంగిపోయిం ది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) వచ్చి పరిశీలించింది. నాసిరకం పనుల వల్లే బరాజ్ కూలిపోయినట్లు ఎన్‌డీఎస్‌ఏ తెలిపింది. బరాజ్ కుంగిన 47 రోజుల తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ 47 రోజులు గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రాజెక్టు కూలిపోయేందుకు బాంబు పెట్టారేమోనని పోలీస్ కేసు పెట్టింది కూడా గత ప్రభుత్వ పెద్దలే. అంతా వాళ్లే చేసి ఇప్పుడు కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.  

ఎన్‌డీఎస్‌ఏ కంటే కేటీఆర్ మేధావా...?

మేడిగడ్డ బరాజ్‌లో నీళ్లు ఆపి పంపింగ్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారని, కానీ ఈ మూడు బరాజ్‌ల వద్ద నీటిని ఆపొద్దని, గేట్లు ఎత్తి పెట్టాలని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌కు ఎన్‌డీఎస్‌ఏ కంటే సాంకేతిక పరిజ్ఞానం ఉందా? ఆయన అంత మేధావా? అని ప్రశ్నించారు. నీటిని నిలిపి ఏదైనా పొరపాటు జరిగితే ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటుందని తెలిపారు. పూర్తయిన సమ్మక్క సారక్క ప్రాజెక్టు కొట్టుకుపోతుందని, సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ఆనకట్టకు నష్టం కలుగుతుందని చెప్పారు. 44 గ్రామాలు మునిగిపోతాయని పేర్కొన్నారు. భద్రాచలం, ఏటూరు నాగారం పూర్తిగా నీటితో నిండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ చెప్పినట్లుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను గేట్లు తెరిచే పెడతామని తేల్చి చెప్పారు. 

ఎల్లంపల్లి నుంచి పంపింగ్

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి రెండుమూడు రోజుల్లో నీటి పంపింగ్ మొదలు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, ఆ తర్వాత ఎల్లంపల్లి నింపాలని అంటున్నారని, అది జరిగే పనికాదని తాము నేరుగా ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తామని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ అనుమతి ఇచ్చేవరకు ఎట్టిపరిస్థితుల్లో మూడు బరాజ్‌ల నుంచి నీటి పంపింగ్ చేపట్టబోమని తేల్చి చెప్పారు. సాగు, తాగునీటి కోసం ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మలన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, లోయర్ మానేరు డ్యాంకు కూడా నీటిని అందిస్తామని తెలిపారు.

ఎల్లంపల్లిలో ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరుందని, 20 వేల క్యూసెక్కుల వరద వస్తోందని, పూర్తి నీటి మట్టానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలుపెడతామని వివరించారు. 14 టీఎంసీల కనీస నీటి మట్టంలో ఉంచి నీటి పంపింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు... ఈసారి గోదావరికి భారీ వరద వస్తోందని, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని ఉంచి మిగతా నీటినంతా పంపింగ్ చేస్తామని తెలిపారు.   

తుమ్మిడిహెట్టి వద్ద సాధ్యమైనా మేడిగడ్డకు మార్చారు

అన్నారం బరాజ్ పంపింగ్ 11 మీటర్ల స్థాయి నుంచి సాధ్యమవుతుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ 5 మీటర్ల స్థాయిలోనే బుంగలు పడ్డాయని తెలిపారు. సుందిళ్ల 9 మీటర్ల ఎత్తులో పంపింగ్ చేయాల్సి వస్తే అక్కడ కూడా 5 మీటర్ల స్థాయిలోనే లీకేజీ మొదలైందని చెప్పారు. మూడు బరాజ్‌లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి కాబట్టే ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేరుకు నీటిని తరలించాలని నిర్ణయించినట్టు వివరించారు. ‘ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నుంచి ఎందుకు ఇది మార్చారు? రీడిజైనింగ్ ఎందుకు చేశారు? అనే దానిపై గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని చెప్పినట్లుగా గత ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. ఇది పచ్చి అబద్ధం. తుమ్మడిహెట్టి వద్ద 75 శాతం ఆధారపడే విధంగా 160 టీఎంసీలతో ప్రాజెక్టు సాధ్యమవుతుందని సీడబ్ల్యూసీ చెప్పింది. బీఆర్‌ఎస్ హయాంలోనే తుమ్మడిహెట్టి వద్ద కట్టాలా? మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలా? అనే అంశంపై ఓ నిపుణుల కమిటీ వేస్తే అది కూడా తుమ్మడిహెట్టి వద్దే కట్టాలని నివేదిక ఇచ్చింది’ అని

తుమ్మిడిహెట్టి వద్ద అంబేద్కర్ పేరుతో ప్రాజెక్టు

గతంలో తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసుల ను అడ్డం పెట్టి ఆపారని మంత్రి విమర్శించారు. తాము మాత్రం పారదర్శ కంగా ఉంటూ బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించా మని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీకి మూడో స్థానం దక్కిందని గుర్తుచేశారు. కాళేశ్వరం అక్రమాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. రైతులను దోచుకుంది బీఆర్‌ఎస్ నాయకులేనని, ఇప్పు డు వారే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లుగా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తుచేశారు. రైతులు పంట నష్టపోయింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల అని, కాంగ్రెస్ వల్ల కాదని ఉత్తమ్ అన్నారు. తుమ్మడిహెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే చెప్పామని, ఆ ప్రాజెక్టుకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. 

కమీషన్ల కక్కుర్తి వల్లే ఈ పరిస్థితి

కమీషన్ల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సరిగా లేవు కాబట్టే బరాజ్ కూలిపోయిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ఆనాటి ఈఎన్‌సీ సర్వీస్ టెర్మినేట్ చేయడమే కాకుండా ఈఎన్‌సీ (జనరల్) ను రాజీనామా కూడా చేయించామని గుర్తుచేశారు. ఎన్‌డీఎస్‌ఏ దేశంలోనే అత్యుత్తమ ఇంజినీర్లతో కమిటీ వేసినట్లు తెలిపారు. కాళేశ్వరంపై పీసీఘోష్ కమిషన్ విచారణ జరుగుతోందని, దీనితో సంబంధం ఉన్న వారిందరినీ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. బరాజ్ గేట్లు ఎత్తేందుకు వాటిని కట్ చేయాల్సి వచ్చిందని అన్నారు. 21 అక్టోబర్‌న మేడిగడ్డ బరాజ్ కుంగిందని, అప్పుడు వారే గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారని, ఇప్పుడు అదే నిర్ణయం కొనసాగుతోందని తెలిపారు.

మరమ్మతులు పూర్తయ్యే వరకు అన్ని గేట్లు పూర్తిగా తెరిచి నీటిని కిందికి వదిలేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించినట్టు చెప్పారు. తప్పులన్నీ మీరు చేసి ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏంటని బీఆర్‌ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌కు ఏ విషయంలోనూ గత ప్రభుత్వం సమయం ఇవ్వలేదని, హడావిడిగా ఒక్కరి నిర్ణయాలతో జరిగిన నిర్మాణం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రాణహిత చేవెళ్ల పనులు చేపట్టి ఉంటే రూ.38 వేల కోట్లలో పనులు పూర్తయ్యేవని, 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేదని అన్నారు. కాళేశ్వరం వల్ల ఇప్పుడు రాష్ట్రంపై రూ.1.47 లక్షల కోట్ల భారం పడబోతోందని తెలిపారు. అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల సూచన మేరకు ఉపయోగంలోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.