24-02-2025 06:11:30 PM
మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకానికి నోచుకోని మహిళలు..
ఎక్స్‌ప్రెస్ లు తీసేసి డీలక్స్ బస్సుల ప్రయోగం..
రెవెన్యూ లాగడమే ఆర్టీసీ అధికారుల పన్నాగమా..?
ప్రజా అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న దారుణం..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై 'శీత' కన్ను..
ఖానాపూర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రంలోనే వెనకబడిన జిల్లా అని పేరు, కాగా అభివృద్ధి, ప్రజా అవసరాల విషయంలో కూడా, ప్రభుత్వాలకు ఇక్కడి నాయకులకు పట్టనట్లు కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు, అందులోనూ గిరిజన నియోజకవర్గమైన ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలపై, ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, శీతకన్ను వేసి, ఇక్కడి ప్రజలను ప్రభుత్వ పథకాలకు దూరం చేసి, పైశాచిక ఆనందం పొందుతుంది, అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో అత్యంత వెనుకబడిన ఖానాపూర్ గిరిజన నియోజకవర్గం, దట్టమైన అడవి అందులోనూ కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఈ మండలాలు ఉంటాయి. అయితే ఈ నియోజకవర్గం మండలాలు ఇటీవల పునర్విభజన జరిగిన మూడు జిల్లాల్లో వివిధ మండలాలు ఉండడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి అదోగతిగా ఉంటుంది.
కనీస అవసరాలకు కూడా నోచుకోక, స్థానిక నాయకులు కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే, మూడు జిల్లాల కలెక్టర్లతో అనుసంధానం కావలసి ఉంటున్న నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వెళ్లి ఏదైనా పని చేసుకోవాలంటే ఏడాదికాలంగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకంతో ప్రజలు కొంచెం ఉరట చెందాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో ఆర్టీసీ అధికారుల లీలలా..? లేక నాయకుల లోపమా..? పైనుంచి ఉత్తర్వులా..? ఏదేమైనా ప్రజలు రాజధానికి ప్రయాణం అవ్వాలంటే ఆర్థిక భారం గతంలో కంటే ప్రస్తుత కాలంలో తడిసి మోపిడౌతుందని వాపోతున్నారు. గతంలో కడం, ఖానాపూర్, నుంచి ప్రతిరోజు తెల్లవారుజాము 5 గంటలకి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ ఉండగా, దానిని ఇటీవల రద్దుచేసి చోద్యం చూస్తున్నారని పలువురు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ సర్వీస్ ద్వారా అనేకమంది ప్రజల కు సౌకర్యవంతంగా ఉండేది, ఈ మండలాల నుంచి విద్యార్థులు, వ్యాపార సంబంద, కార్యాలయాల పనులపై చాలామంది హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి తిరిగి రాత్రికి ఇంటి ముఖం పట్టేవారు.
ప్రతిరోజు ప్రజలు విరివిగా ప్రయాణం చేసే ఈ బస్సు సర్వీసును ఇటీవల రద్దు చేయడంతో, వినియోగదారులు చేసేది లేక, పక్క జిల్లాలైనటువంటి జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్, మెట్పల్లి, పట్టణాలకు వెళ్లి బస్సులను ఆశ్రయించి, హైదరాబాద్ చేరుకుంటున్నారు. లేనట్లయితే అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు అది లేకపోతే సొంతంగా కారులు తీసుకుని హైదరాబాద్ వెళుతున్నారు. దీంతో ప్రజలపై ఆర్థికంగా పెనుబారం, కాలయాపన పడుతుంది. దాంతో పాటు రాత్రివేళ తొమ్మిది గంటలకు ఉన్న నిరంతర ఎక్స్ప్రెస్ సర్వీస్ ను మార్చి, డీలక్స్ బస్సును వేయడంతో, ఈ రెండు మండలాల మహిళలు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి నోచుకోలేకపోతున్నారు. అంతేకాకుండా, గతం కంటే ప్రస్తుతం మరింత ఆర్థిక భారం మోయాల్సి వస్తుందని, ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇదే అదునుగా, ఆర్టీసీ అధికారులు ప్రజల అవసరాన్ని అలుసుగా తీసుకుని, డీలక్స్ బస్సులు వేసి తమాషా చూస్తున్నారని, పలువురు ప్రయాణికులు వాపోవడం గమనార్హం. కాగా ఆర్టీసీ అధికారుల ధోరణి ప్రజలకు అర్థం కాక, చేసేది లేక, చచ్చినట్లు, డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
అయితే ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండు రోజుల క్రితం, నియోజకవర్గంలోని, ఉట్నూరు నుంచి, శంషాబాద్ వరకు మరో డీలక్స్ ను ప్రయోగించింది. ఈ బస్సు నియోజకవర్గంలోని 4 మండలాలను కవర్ చేస్తూ, జగిత్యాల, నిజాంబాద్, జిల్లాల మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు అభినందనీయమే అయినప్పటికీ, నియోజకవర్గ ప్రజలపై ఎందుకు ప్రేమ లేదని..?మహాలక్ష్మి ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వరని..? పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా పక్క జిల్లాలైన జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, నిజామాబాద్, జిల్లాల్లో విరివిగా ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉండగా, తమకి ఈ అవకాశం ఎందుకు ఇవ్వారని..? ప్రజలు పలువురు ప్రశ్నిస్తున్నారు..? ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కలు గిరిజన నాయకులు అయినప్పటికీ గిరిజన నియోజకవర్గమైన ఖానాపూర్ మీద శీతకన్ను ఎందుకు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా నాయకులు చొరవ చూపి ప్రజల అవసరాలను, ఇక్కడి పరిస్థితులను బేరీజు వేసుకొని, ఉదయకాల, రాత్రి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చి ప్రజలను అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలకు, పాత్రులను చేయాలని ప్రాధేయపడుతున్నారు.