calender_icon.png 21 September, 2024 | 1:53 AM

వెంటాడుతున్న సండే భయం

21-09-2024 12:08:16 AM

  1. హైడ్రా చేతికి హిమాయత్ సాగర్ ఆక్రమణల చిట్టా
  2. ఆక్రమణదారుల్లో నెలకొన్న భయం 
  3. ఆక్రమణలపై  అధికారులతో పలు దఫాలు చర్చించిన హైడ్రా కమిషనర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు, ముఖ్యంగా వ్యాపార, రాజకీయ వర్గాలు హైడ్రా జరిపే కూల్చివేతలతో బెంబేలెత్తిపోతున్నారు. గత నెల 8వ తేదీన ఒకేసారి దుండిగల్ కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్‌పూర్ చెరువు ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఆక్రమణలపై హైడ్రా అధికారులు దృష్టి కేంద్రీకరించగా, అక్రమ నిర్మాణాల జాబితాను కూడా తెప్పించుకోవడంతో మరోసారి హైదరాబాద్ నగర వాసులకు వీకెండ్ గుబులు పట్టుకుంది. దీంతో ఈ వీకెండ్‌లో హైడ్రా అధికా రులు నగరంలోని ఏ మూలన చెరువులను చెరబట్టి నిర్మించిన ఆక్రమణలను కూల్చివేస్తారోనని చర్చించుకుంటున్నారు. 

హిమాయత్ సాగర్‌పై సమీక్ష.. 

హైదరాబాద్‌లో హైడ్రా బాంబు ఎప్పుడు ఏ వైపు పడుతుందోనని ఆక్రమణదారులు భయాందోళనలు చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఓఆర్‌ఆర్ దాకా, ఇంకా చెప్పాలంటే ఆక్రమణల కూల్చివేతలో సహకరించాలంటూ కోరిన ప్రభుత్వ శాఖలకు హైడ్రా నేనున్నానంటూ అండగా నిలిచి, ఆక్రమణదారులపై కొరడా ఝులిపిస్తుంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు అందిన ఫిర్యాదులపై కొన్నాళ్లుగా హైడ్రా కసరత్తు చేస్తోంది.

హిమాయత్‌సాగర్ ప్రాంతంలో అసలు ఎన్ని నివాసాలు ఉన్నాయి.. వాటిలో ఆక్రమణలు ఎన్ని అనే అంశంపై వివరంగా నివేదిక రూపంలో అందజేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు హైడ్రా కమిషనర్ ఇప్పటికే సూచనలు చేశారు. దీంతో ఆక్రమణల జాబితాను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు జలమండలి అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టి  జాబితాను రూపొందించినట్టుగా విశ్వసనీయ సమాచారం. 

వెంటాడుతున్న భయం..

ఈ నెల 8న ఆదివారం ఒకేసారి దుండిగల్ ప్రాంతంలో కత్వా చెరువును ఆక్రమించుకుని నిర్మాణం చేసిన విల్లాలను, అమీన్‌పూర్ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. అయితే, ఆదివారానికి శనివారం ఒక్కరోజే ఉండడంతో.. ఇదే సమయంలో హిమాయత్ సాగర్‌పై సమీక్ష నిర్వహించడంతో హిమాయత్ సాగర్ ఆక్రమణదారులకు ఒక్కసారిగా గుబులు పట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలను ఆదివారం చేపడతారా..? మరికొంత సమయం తీసుకుంటారా అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. 

హైడ్రా చేతికి ఆక్రమణల చిట్టా... 

ఉస్మాన్ సాగర్ (గండిపేట) ప్రాంతంలోని ఖానాపూర్, చిలుకూరులోని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిం చిన 24 ఆక్రమణలను హైడ్రా అధికారులు ఆగస్టు 18న కూల్చివేసి సుమారు 15 ఎకరాల భూమిని పరిరక్షించారు. దీంతో హైడ్రా భయానికి హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను, ప్రహరీలను ఆక్రమణదారులే తమకు తామే కూల్చివేసుకోవడం విశేషం. గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధి ఆక్రమణలను కూల్చివేసిన తర్వాత హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్‌పై దృష్టిని కేంద్రీకరించారు.

దీంతో స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ బోర్డు అధికారులతో పలు దఫాలుగా చర్చించి హిమాయత్ సాగర్ పరిధిలో మొత్తం నిర్మాణాలకు సంబం ధించిన వివరాలను అందజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శుక్రవారం హిమాయత్ సాగర్ ఆక్రమణలపై సమీక్ష జరగడం హాట్ టాపిక్‌గా మారింది. హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో మొత్తం 83 అక్రమ నిర్మాణాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీటిని త్వరలో కూల్చివేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.