12-04-2025 11:52:56 PM
భోపాల్: పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రీమోనినీ ఆశ్రయించిన తెలుగు ఎన్నారైకి అన్నాచెల్లెలు చుక్కలు చూపించారు. నకిలీ ప్రొఫైల్‌తో పరిచయం పెంచుకొని పెళ్లి పేరుతో నమ్మించి ఏకంగా రూ.2.68 కోట్లకు టోపీ పెట్టారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఆ యువకుడు స్వదేశానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు అమెరికాలోని నార్త్ కరోలినాలో ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2023లో ఆయను మ్యాట్రిమోనిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన బర్కా జైస్వానీ అనే పేరుతో ఒక యువతి పరిచయమైంది. కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత వాట్సాప్‌లోనూ టచ్‌లోకి వచ్చారు.
పెళ్లి పేరుతో నమ్మించిన ఆమె యువకుడితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. అనారోగ్యం, ఇతర కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అలా 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా రూ. 2.68 కోట్ల నగదు బదిలీ చేయించుకుంది. ఇటీవల ఆ యువకుడు బర్కాకు వీడియో కాల్ చేయగా.. అందులో ఉన్న అమ్మాయి.. మ్యాట్రిమోని ప్రొఫైల్‌లో ఉన్న అమ్మాయి ఒకలాగా అనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. డబ్బుల విషయం అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో బర్కా అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లయిందని నిర్ధారించారు. మ్యాట్రిమోనిలో ఒక మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్ జైస్వానీతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.