పారాలింపిక్స్‌లో ఒకేరోజు 4 పతకాలు
ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజునే భారత పారా అథ్లెట్లు పతకాలు పంట పండించారు. ఒకేరోజున నాలుగు పతకాలు సాధించి పారిస్ గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. షూటింగ్‌లో మూడు పతకాలు రాగా.. అవనీ తన స్వర్ణం నిలుపుకోగా.. మనీశ్ నర్వాల్ అద్భుత ఆటతో రజతం ఒడిసిపట్టగా.. మోనా అగర్వాల్ కాంస్యంతో సత్తా చాటింది. ఇక అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్ రూపంలో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. రానున్న రోజుల్లో మన పారా అథ్లెట్లు 25 పతకాల టార్గెట్‌ను దాటేయాలని ఆశిద్దాం..!
- షూటింగ్‌లో మూడు.. అథ్లెటిక్స్‌లో ఒకటి
- అవనీకి స్వర్ణం, మనీశ్‌కు రజతం, మోనాకు కాంస్యం
- కాంస్యంతో మెరిసిన ప్రీతి పాల్
పారాలింపిక్స్‌లో రెండో రోజున నాలుగు పతకాలతో భారత్ మురిసింది. పారా షూటింగ్‌లో వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం భారత్ ఒడిలో చేరగా.. అథ్లెటిక్స్‌లో మహిళల టీ35 100 మీ ఈవెంట్‌లో కాంస్యం వచ్చి చేరింది. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్ 1) షూటింగ్ విభాగంలో అవనీ లేఖరా (249.7 పాయింట్లు) స్కోరుతో పసిడితో మెరవగా.. ఇదే విభాగంలో మోనా అగర్వాల్ (228.7 పాయింట్ల) కాంస్యం దక్కించుకుంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన లీ (246.8 పాయింట్ల) రజతం సాధించింది. పారాలింపిక్స్‌లో మహిళల షూటింగ్ విభాగంలో మన దేశానికి ఒకేరోజున రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి.
ఇక పురుషుల 10 మీ ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్ 1) విభాగంలో మనీశ్ నర్వాల్ (234.9 పాయింట్లు) రజతం కైవసం చేసుకోగా.. దక్షిణ కొరియా షూటర్ జెడి జో (237.4 పాయింట్లు), చైనా షూటర్ యాంగ్ (214.3 పాయింట్లు) స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. అథ్లెటిక్స్ విభాగంలో మహిళల టీ35 100 మీటర్ల ఫైనల్లో భారత పారా అథ్లెట్ ప్రీతి పాల్ (14.21 సెకన్లలో) గమ్యాన్ని చేరి కాంస్యం ఒడిసిపట్టింది. చైనా అథ్లెట్ గ్జియా (13.58 సెకన్లు), క్విన్‌కియాన్ (13.74 సెకన్లు) స్వర్ణ, రజతాలతో మెరిశారు.
తొలి షూటర్‌గా రికార్డు..
పారిస్‌లో స్వర్ణం కొల్లగొట్టిన భారత పారా షూటర్ అవనీ లేఖరా మరో రికార్డు సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. టోక్యో పారాలింపిక్స్‌లోనూ అవనీ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్ 1) కేటగిరీలో ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో 625.8 పాయింట్లు స్కోరు రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో అవనీ తన ప్రతిభను చాటుతూ 249.7 పాయింట్లు స్కోరు చేసి పసిడి సొంతం చేసుకుంది. గత టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో పతకం సాధించిన అవనీ తాజాగా పారిస్‌లో తన రికార్డును సవరించుకొని మరోసారి స్వర్ణం చేజెక్కించుకుంది.
11 ఏళ్ల వయసులో కారు యాక్సిడెంట్ కారణంగా రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 2015 ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆర్చర్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ తనకు అచ్చొచ్చిన షూటింగ్ వైపు మళ్లిన అవనీ పారాలింపిక్స్‌లో వరుసగా రెండు స్వర్ణ పతకాలతో మెరిసి దేశం గర్వంగా తలెత్తుకునేలా చేసింది. అయితే పారిస్ పారాలింపిక్స్ ముందు గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)కు సర్జరీ చేయించుకున్న అవనీ కొన్ని వారాల ముందే తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. అయితే పతకం సాధించాలన్న తన ఏకాగ్రతను మాత్రం కోల్పోలేదు. ఇక 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లోనూ బరిలో ఉన్న అవనీ మరో పతకంతో మెరవడం ఖాయంగా కనిపిస్తోంది. గత టోక్యోలో 50 మీటర్ల రైఫిల్ పొజిషన్‌లో కాంస్యం నెగ్గింది.
పోలియో నుంచి పతకం దాకా..
షూటింగ్‌లోనే కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్ 9 నెలల వయసులోనే పోలియో బారిన పడింది. అయితే చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనబరిచిన మోనా షాట్‌పుట్, పవర్ లిఫ్టింగ్, వీల్‌చైర్ వాలీబాల్ క్రీడల్లో ఆరితేరింది. అయితే 2021లో షూటింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్న మోనా ఆడుతున్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించి ఔరా అనిపించింది. 2023లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొరియా వేదికగా జరిగిన పారా ప్రపంచకప్‌లో స్వర్ణంతో మెరిసింది. ఇక పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పాల్గొన్న మోనా అగర్వాల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 623.1 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్లో మిగతా ప్రత్యర్థులను దాటి వచ్చిన మోనా 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో కాంస్యం గెలిచి జాతీయ జెండాను రెపరెపలాడించింది.
ఫ్యామిలీ మొత్తం షూటర్లే..
గత టోక్యో పారాలింపిక్స్‌లో 50 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం సాధించిన మనీశ్ నర్వాల్ ఈసారి వ్యక్తిగత విభాగంలో పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే పారిస్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్ 1) ఫైనల్లో 234.9 పాయింట్లతో రజతం సాధించాడు. ‘9ఎస్’ సిరీస్‌లో పాయింట్లు సాధించడంలో విఫలమైన మనీశ్ ఆఖర్లో ఫుంజుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌంఢ్‌లో 565 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో షూటర్ రుద్రాంక్ష్ 561 పాయింట్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
ఇక మనీశ్ షూటర్ల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాడు. హర్యానాకు చెందిన మనీశ్ ఫ్యామిలీలో అందరూ షూటర్లే కావడం విశేషం. సోదరి శిఖా నర్వాల్ కూడా అంతర్జాతీయ షూటర్‌గా రాటు దేలుతుంది. 2016లో పిస్టల్ షూటింగ్ ట్రైనింగ్ తీసుకున్న మనీశ్ 2021 పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో పీ4 మిక్సడ్ 50 మీ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్స్‌లో స్వర్ణ, రజత, కాంస్యాలు సాధించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన మనీశ్‌ను భారత ప్రభుత్వం 2021లో క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్త్న్ర అవార్డుతో సత్కరించింది.
సోషల్ మీడియా ప్రభావంతో..
పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో టీ35 100 మీటర్ల పరుగులో (14.21 సెకన్లు) కాంస్యం నెగ్గి ప్రీతి పాల్ చరిత్ర సృష్టించింది. ట్రాక్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పారాలింపిక్స్‌లో 1984 నుంచి అథ్లెటిక్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్.. ఇప్పటివరకు సాధించిన అన్ని పతకాలు ఫీల్డ్ విభాగంలో నుంచే రావడం గమనార్హం. పారిస్‌కు ముందు మేలో కోబే వేదికగా జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ ప్రీతి పాల్ కాంస్యం నెగ్గింది.
23 ఏళ్ల ప్రీతి పాల్ ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చింది. పుట్టుకతోనే మానసిక సమస్యలతో సతమతమయిన ప్రీతి పాల్‌కు పుట్టిన ఆరు రోజులకే శరీరం కింద బాగంలో ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. 17 ఏళ్ల వయసులో సోషల్ మీడియా ద్వారా పారాలింపిక్స్ గేమ్స్ గురించి తెలుసుకుంది. ట్విటర్, యూట్యూబ్‌లో పారాలింపిక్స్ వీడియోలను వీక్షించిన ప్రీతి తాను కూడా పారా అథ్లెట్‌గా మారాలనుకుంది. కానీ ఆమె జీవితాన్ని మార్చింది మాత్రం మాజీ పారా అథ్లెట్ ఫాతిమా ఖాతూన్. అథ్లెటిక్స్‌లో ప్రీతిని పరిచయం చేసింది ఫాతిమానే.
2018 నుంచి ఫాతిమా సహాయంతో జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న ప్రీతి 100 మీ, 200 మీ స్ప్రింట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చిన ప్రీతి కొత్త కోచ్ గజేందర్ సింగ్ సహాయంతో రన్నింగ్‌లో టెక్నిక్స్‌కు మెరుగులద్దుకుంది. అలా ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీ, 200 మీ స్ప్రింట్ ఈవెంట్స్‌లో కాంస్య పతకాలతో మెరిసి పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది.
పారాలింపిక్స్‌లో నేటి భారతీయం
పారా అథ్లెటిక్స్
పురుషుల షాట్ పుట్ ఎఫ్ 37 ఫైనల్ ఈవెంట్
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 57 ఫైనల్ ఈవెంట్
పారా షూటింగ్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 క్వాలిఫికేషన్
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 క్వాలిఫికేషన్
పారా సైక్లింగ్
మహిళల సీ1 500 మీటర్ల టైమ్ ట్రయల్ క్వాలిఫయింగ్
పురుషుల సీ1 1000 మీటర్ల టైమ్ ట్రయల్ క్వాలిఫయింగ్
పారా టేబుల్ టెన్నిస్
మహిళల డబుల్స్ డబ్ల్యూడీ 10 సెమీఫైనల్స్
పారా రోయింగ్
మిక్స్‌డ్ డబుల్స్ స్కల్స్ పీఆర్ 3 రెపిచేజ్ మ్యాచ్‌లు
పారా ఆర్చరీ
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు
పారా బ్యాడ్మింటన్
మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్