calender_icon.png 13 January, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌జెండర్లకు స్నేహ హస్తం

27-08-2024 12:00:00 AM

ట్రాన్స్‌జెండర్ అంటేనే సమాజంలో చిన్నచూపు.. ఎన్నో ఛీత్కారాలు.. మరెన్నో అవమానాలు.. సొసైటీలో నిత్యం కళ్లముందు జరిగే అవమానాలు.. ఇవన్నీ ఆమెను కదిలించాయి. ‘ట్రాన్స్ అంటే జస్ట్ జెండర్ మాత్రమే.. ఒక ఇన్‌స్పిరేషన్’ అంటూ చాటిచెబుతుందామె. అంతేకాదు.. యూట్యూబ్  ఛానల్ స్టార్ట్ చేసి ట్రాన్స్‌జెండర్ జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇతర జెండర్స్‌కు  పోటీగా నిలుస్తూ ‘బెస్ట్ ఇన్‌ప్లూయర్’గా పేరు తెచ్చుకున్న స్నేహ పరిచయం ఈవారం విజయలో..

అతనో అబ్బాయి.. పెరుగుతున్నకొద్దీ తన హావభావాలు, శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం మొదలయ్యా యి. ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. కానీ ఇంట్లో మాత్రం ఆడపిల్లల పనులు చేసేవాడు. స్కూల్‌లోనూ అమ్మాయిలతో స్నేహంగా మెలిగేవాడు. ఇవన్నీ అతనిపై ‘చెక్క‘ అని ముద్రపడేలా చేశాయి. సొంత కుటుంబ నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.

సీన్ కట్ చేస్తే అతనో అమ్మాయిగా మారాడు. అంతటితో ఆగకుండా తనలాంటివాళ్ల కోసం ఏకంగా ‘ఇట్స్ మీ స్నేహ’ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్ జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నాడు ఒకే ఒక సబ్‌స్ర్కైయిబ్‌తో మొదలైన స్నేహ ప్రయాణం.. నేడు 5 లక్షల దాకా చేరింది. అయితే సతీష్ ఎందుకు స్నేహగా మారాడు. ట్రాన్స్‌జెండర్ల కోసం యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఒకసారి స్నేహ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.. 

అతడు కాదు.. ఆమె

సతీష్‌కుమార్‌ది వరంగల్ జిల్లా. మొత్తం ముగ్గురు సంతానం. అందులో పెద్దవాడు సతీష్. అయితే చిన్నప్పట్నుంచే హార్మోన్ సమస్యతో బాధపడేవాడు. ఆ విషయం అతనికి కూడా తెలియదు. కానీ ప్రవర్తన అచ్చం ఆడపిల్లలా ఉండేది. మొదట్లో తల్లిదండ్రులకు అర్థంకాలేదు. కానీ సతీష్ ప్రవర్తన, పనులన్నీ ఆడపిల్ల మాదిరిగా ఉండటంతో కుటుంబసభ్యుల్లో అనుమానం మొదలైంది. స్కూల్‌కు సెలవులు వస్తే.. అమ్మకు సాయం చేయడం.. వంటింట్లో దూరి గిన్నెలు కడగటం లాంటివి చేస్తుండటంతో ఫ్యామిలీమెంబర్స్ షాక్ అయ్యా రు.

ఇక స్కూల్‌లోనూ అమ్మాయిలతో తిరగడం.. వాళ్లలా ప్రవర్తించేవాడు. దాంతో సతీష్ కుమార్‌ను ‘చెక్క’ అని పిలిచేవారు. అయితే పేరెంట్స్‌కు అసలు విషయం తెలిశాక తిట్టడం మొదలుపెట్టారు. అయినా సతీష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్రంగా కొట్టేవారు. ఒకవైపు ఇంటిలో.. మరోవైపు పాఠశాలలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. దాంతో చదువులో ఫస్ట్ ఉండే సతీష్ సమాజ వేధింపుల వల్ల చదువులో వెనుకబడిపోయాడు. 

సతీష్ నుంచి స్నేహగా..

సతీష్ పెరుగుతున్నకొద్దీ హార్మోన్ సమస్యలూ పెరుగుతువచ్చాయి. కుటుంబసభ్యులు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాలేదు. చివరకు పెళ్లి చేయాలనే ఫిక్స్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో సతీష్‌కు ‘నేను అబ్బాయి కాదు.. ఓ అమ్మాయి’ అనే విషయం అర్థమైంది. ‘ఒక అమ్మాయిని మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారా”? అని ప్రశ్నించాడు. అయినా తల్లిదండ్రుల మనుసు కరగలేదు. చదువు చెప్పిన గురువులు అర్థం చేసుకోలేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి లైలా అనే ట్రాన్స్‌జండర్‌తో తన బాధలను పంచుకున్నాడు.

ఆ తర్వాత అమ్మాయిలా మారాడు. ఈక్రమంలో 40రోజులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. లైలా గైడెన్స్‌తో చదువుకుంది. అయితే బెగ్గింగ్ చేసే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కూడా. “పది రూపాయలు ఇస్తా.. నీ పైటా కొంచెం కిందకు దించు... ఒకసారి బావా అని పిలుస్తావా” అనే మాటలు స్నేహను బాధించినా పొట్టకూటీ కోసం భిక్షాటన మానలేదు.  చిన్నప్పుడు ‘చెక్క’ అన్నవాళ్లు.. ట్రాన్స్‌గా మారిన తర్వాత ‘కొజ’్జ అంటూ మానసిక వేధింపులకు గురిచేశారు. అయినా ధైర్యంతో ముందుకు సాగింది స్నేహ.

కుటుంబానికి పెద్దక్కగా

ఒకసారి రైలులో బెగ్గింగ్ చేస్తున్న సమయంలో ప్రయాణికులు తీవ్రంగా కొట్టి, తోసేయడంతో చావు అంచులదాకా వెళ్లింది. ‘చదువుతోనే సరైన గుర్తింపు’ ఉంటుంది అని భావించి ఎమ్‌ఏ సోషియాలజీ చేసింది. ఉన్నత చదువులు చదివినా ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. “ట్రాన్స్ జెండర్‌కు ఉద్యోగం ఇస్తే మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మా కంపెనీ ప్రోడక్ట్స్ ఎలా అమ్ముడుపోతాయి? లాంటి మాటలతో మానసిక వేదనకు గురిచేశారు. ఇలాంటి అనుమానాల మధ్య కూడా చిన్నాచితక ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత తమ్ముడి సహకారంతో సొంతంగా ఇంటిని కొనుక్కుంది.

ఒకప్పుడు వద్దనుకున్న కుటుంబానికి పెద్దదిక్కై... తమ్ముడి, చెల్లి పెళ్లి చేసింది. ఇక తనలాంటివాళ్ల కోసం ‘ఇట్స్ మీ స్నేహ’ అనే యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్ కళాకారులను ఆ యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తోంది. ట్రాన్స్‌జెండర్ల జీవితాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కళ్లకు కట్టినట్టు వివరిస్తుండటంతో స్నేహకు మంచి పేరొచ్చింది. ఒకప్పుడు ఒక సబ్‌స్ర్కైయిబ్‌తో మొదలైన ఆమె ఛానల్.. 5.5 లక్షల సబ్‌స్ర్కైయిబ్స్, వేలాదిమంది ఫాలోవర్స్ తోదూసుకుపోతోంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ స్నేహ శ్రమను గుర్తించి ‘బెస్ట్ ఇన్‌ఫ్లూయర్’ అవార్డుతో సత్కరించింది. 

మార్పు రావాలి

సొసైటీలో ట్రాన్స్‌జెండర్స్‌ను చూసే విధానం మారాలి. సమాజంలో మగవాళ్లు, ఆడవాళ్లతో సమానంగా మమ్మల్ని పరిగణించాలి. ట్రాన్స్‌జెండర్లు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కచ్చితంగా మాకు అవకాశాలు కల్పించాలి. సొసైటీలో మార్పు వచ్చినప్పుడు ట్రాన్స్‌జెండర్ల జీవితాలు మరింత మెరుగుపడుతాయి. 

రియల్ హీరో విజయ్ దేవరకొండ

లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది ట్రాన్స్‌జెండర్ల జీవితాలు చిన్నాభిన్నామయ్యాయి. అయితే నేను చిన్నప్పట్నుంచే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకొని ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టా. కేవలం 15 నిమిషాల్లోనే కాల్ చేశారు. నెల రోజులకు సరిపడే వంట సామగ్రిని ఇప్పించారు. అంతేకాదు.. నాతో పాటు 18 మంది ట్రాన్స్ కుటుంబాలకు సాయం చేసి విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇటీవల అతన్ని ఓ టీవీ ప్రోగ్రామ్‌లో కలుసుకొని థ్యాంక్స్ చెప్పాను. విజయ్ దేవరకొండ చేసిన సాయం జీవితంలో మరిచిపోలేనిది. 

 బాలు జాజాల