ఓ తాబేలు పిల్ల
తాబేటి చిప్పమీంచి తామరాకుల
మీదకి గంతులేస్తూ గోలగోల
నీటిలో తామర తూడుల ఊడలు
కోతుల్లా వేలాడుతూ
ఊయలూగుతూ ఆటలు
నేనూ నా కలలూ కప్పలూ తామరాకు మీద నీటి బిందువుతో సాకర్
మేం నీటిలోకి దూకినపుడు
బిందువుల ఆర్కెస్ట్రా
నీటిలోంచి ఎగిరినపుడు బిందు
అందెలతో డ్యాన్సాట
నీటి లోపలికి బంగారు వలని
తీసుకుని సూరయ్య
వెండి అలల కింద వెన్నెల
అంచులు తీసుకుని జాబిలమ్మ
అలలై విస్తరించే కాలంతో కోలాటం
అలల్లేని ఉమ్మనీటిలో మహానిద్ర
నీటి బుడగల్లో కూర్చున్న డాల్ఫిన్లు
కప్పలు చేపలు హిప్పోలతో
జలాశయంలోనో లేక జలాకాశంలోనో గ్రహాల మధ్య సంచారం
చెరువులోంచి లేచి బయటికి చూస్తే
తలమీంచి ప్రసరించే అలలు
చెరువు గట్టున ఎవరో
సైకిల్ దిగి స్టాండు వేసి
పాంచాల దగ్గర కాళ్లూ చేతులూ
ముఖం కడిగి
కాసిన్ని నీళ్లు పుక్కిలించి
ముఖం మీద వర్షించి పోతాడు
నా ముఖం పొలాలతో
చిత్తడి అడవులతో వికసిస్తుంది
నా ముఖంలోంచి బయటికొచ్చే
మౌనవాక్యం మట్టిరోడ్డు వెంట
ఒకడు డొక్కు సైకిల్ మీద చేతులొదిలేసి
ఇచ్చోటనే.....పజ్జెం పాడుకుంటూ పోతాడు
మరొకడు గుహలోంచో లేక
కృష్ణబిలంలోంచో
రష్యా క్షిపణి, ఉక్రెయిన్ టాంకర్,
ఇజ్రాయిలీ బాంబు
ఓ డజను పెంటగన్లు,
వాటి బుర్రలోని ఆటమ్ బాంబులు
సైకిలు చుట్టూ అరటి గెలల్లా కట్టుకుని
సూపర్ సోనిక్ వేగంతో దూసుకొచ్చి
సప్త సముద్రాల, సమస్త ఖండాల
గుప్పెడంత గుండె చెరువులో పేల్తాడు
అణు విస్ఫోటన గొడుగులో
సుడి తిరుగుతూ
హిరోషిమా నాగసాకి నగరాల ఆక్రందన
పగిలి శకలాలు శకలాలై
రేడియేటెడ్ ధూళి గప్పిన
నా కలమీద పడి
గుండెలు బాదుకుంటూ ఏడ్చే ఆమె-
ఆమె ఒడిలో వెర్రిచూపులు చూస్తూ
అయోమయంగా కూర్చున్న శిశువు నేనే.