ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన, పలు అంశాలు పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక శాతం ఉన్న ఆదివాసి గిరిజనుల జీవన విధానం, వారి ఆచార సంప్రదాయాల పరిశీలనకై మహారాష్ట్ర శాస్త్రవేత్తల బృందం భద్రాచలం ఏజెన్సీకి మంగళవారం చేరుకుంది. కొండకోనల్లో నివసిస్తూ, అటవీ ప్రాంతంలో దొరికే అటవీ ఫలాలు, సహజ వనరులతో సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించడంతో పాటు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ వివిధ రకాలైన బలవర్ధకమైన ఆదివాసి వంటకాలు, పాత తరం కళాకృతులను తయారుచేసి జీవనోపాధి పొందుతున్న ఆదివాసి గిరిజనుల జీవనస్థితిగతులను తెలుసుకోవడానికి ఈ బృందం పర్యటన సాగిస్తోంది. తొలుత ఐటీసీ బిపిఎల్ లో సాగు చేస్తున్న వెదురు ప్లాంటేషన్ పరిశీలించారు.
అనంతరం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియంను ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గుంగా, రాహుల్ కుమార్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సిద్ధి పెడ్నేకర్, అమృత బెల్స్ సందర్శించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి దుమ్ముగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చిన్న నల్లబెల్లి గ్రామపంచాయతీలోని టైలర్ పేట సందర్శించి ఆ గ్రామంలోని ఆదివాసి గిరిజనుల యొక్క జీవనస్థితిగతుల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన రైతు మహిళలను వెదురు చెట్ల పెంపకానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి అవగాహన కల్పించి వారి పంట పొలాల చుట్టూ గట్లపైన వెదురు మొక్కలు నాటి ఎకరానికి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు వచ్చేలా చేసుకోవచ్చని అంతర్ పంటలుగా కూడా వెదురు మొక్కలు వేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని, త్వరలో గిరిజన రైతు మహిళలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని బృందం సభ్యులు గిరిజన మహిళలకు తెలిపారు.
అనంతరం బృందంలోని సీనియర్ సభ్యుడు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సూచనలు మేరకు కొత్తగూడెం జిల్లా సందర్శన ప్రాంత అభివృద్ధి, జీవనోపాదుల పరంగా విలువైన అనుభూతి కలిగిందని, ఈ జిల్లా వ్యవసాయం, తోటల పంటల సాగు కోసం అపారమైన అవకాశాలు కలిగి ఉందని, జిల్లా ప్రజలు వివిధ జీవనోపాదులలో నిమగ్నమై ఉండడం చాలా సంతోషమని, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం చాలా వైవిధ్యంగా ఉందని అన్నారు.
కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ వాతావరణం, జీవవైవిద్య పరిస్థితులను అర్థం చేసుకున్నామని, వెదురు పంటలను స్థానిక ప్రజలకు ఉపాధి మార్గంగా పరిచయం చేయడానికి పలు గ్రామాలు సందర్శించామని, ఈ పరిశీలన ద్వారా గిరిజన ప్రజల నుండి అనేక కీలక విషయాలు మా దృష్టికి వచ్చాయని, స్థానిక ప్రజలు వెదురు ప్రాజెక్టు పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, వెదురు సాగుతో విజయవంతం సాధించడానికి అవసరమైన సహాయాన్ని సమర్థవంతంగా అందించడం కీలక ఉద్దేశమని, ఈ జిల్లా సందర్శనలో భాగంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆతిథ్యం అభినందనీయమని, సందర్శన సమయంలో సిబ్బంది, స్థానిక కమ్యూనిటీ సభ్యులు అందించిన ఆత్మీయ స్వాగతం ఆనందం కలిగించిందని, వారి సహకారంతో జిల్లా అభివృద్ధి పనుల్లో ముందుకు సాగడానికి ప్రోత్సాహం కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంహెచ్ఆర్సి నాగేశ్వరరావు, ఆర్ఐ వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం ఏపీఎం హేమంత్ ని, డిపిఎం రంగారావు, సీసీ నరసింహారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.