calender_icon.png 23 October, 2024 | 6:05 AM

హెన్ నదిని పరిశీలించిన మంత్రుల బృందం

23-10-2024 01:44:43 AM

సియోల్‌లో రెండో రోజూ కొనసాగిన పర్యటన

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో మంగళవారం రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో నీటి నాణ్యత కేంద్రంలో కీలకంగా పేరుగాంచిన హన్ నదితో పాటు సియోల్ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శించి, మాలిన్యాన్ని ఎలా శుద్ధి చేస్తారో పరిశీలించారు.

మూసీ నదిని పునరుజ్జీవనం చేసే ప్రక్రియలో భాగంగా అధ్యయనం చేసేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం సియోల్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు దక్షిణ కొరియా అభివృద్ధిలో కీలకంగా మారిన చెయోంగ్‌గే చోన్ నది పునర్నిర్మాణాన్ని అధ్యయనం చేయగా, రెండో రోజు హన్ నదిని పరిశీలించారు.

సియోల్ నీటి శుద్ధి కేంద్రంలో మాలిన్యాన్ని ఎలా శుద్ధి చేస్తారో అనే అంశంతో పాటు సియోల్ నీటి రీసైక్లింగ్ కార్పొరేషన్ (ఎస్‌డబ్ల్యూఆర్), సియోల్ మున్సిపల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సియోనామ్, టాంచియాన్ మాలిన్య కేంద్రాల పనితీరును బృంద సభ్యులు పరిశీలించారు.

2020లో ఈ శుద్ధి కేంద్రాలను ప్రారంభించగా, వీటి ద్వారా ప్రతిరోజూ సగటున 1.63 మిలియన్ టన్నుల మాలిన్య శుద్ధి సామర్థ్యం కలిగి ఉండి, హన్ నది నీటి నాణ్యతను నిర్ధారించడంలో కీలకంగా వ్యవహరిస్తునట్టు మంత్రు ల బృందం తెలిపింది. ఈ కేంద్రాలు దక్షిణ కొరియాలోనే అతి పెద్దవిగా, ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో గుర్తింపు పొందాయన్నారు.

ఈ కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాగోక్ జిల్లాలో కమర్షియల్ పథకాల కోసం, టాయిలెట్ల కోసం, రోడ్లను శుభ్రపర్చేందుకు  పునర్‌ఃవినియోగిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, పర్యావరణానికి హాని లేకుండా, పర్యావరణ అనుకూలమైన సాంకేతికతలు, భవన నిర్మాణాలు, జీవ వైవిధ్యంతో ఏర్పాటు చేసిన రహదారులు, ఇళ్ల చుట్టూ ఏర్పాటైన పార్కులపై బుధవారం రాష్ట్ర మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది.