ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘భోలే బాబా’ పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 121 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉండటం మరింత విషాదం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని దుర్ఘటనల్లో జరిగినట్లుగా ఈ ఘటనపైనా ఉత్తరప్రదేశ్ మఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో శాఖాపరమైన దర్యాప్తు జరిపిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం, దోషులను వదిలిపెట్టేది లేదన్న సీఎం ప్రకటన పోయిన ప్రాణాలను తిరిగి తీసుకు రాలేవు. కానీ, దేశ చరిత్రలోనే పెద్ద తొక్కిసలాట ఘటనల్లో ఒకటిగా భావిస్తున్న ఈ పెను విషాదం అధికారుల నిర్లక్ష్యంతోపాటు జనం మూఢభక్తికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ప్రసిద్ధుడైన భోలే బాబా ప్రతి మంగళవారం సత్సంగ్‌లు నిర్వహి స్తారు. యూపీసహా పొరుగు రాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. హత్రాస్‌లోని పుల్య్రీ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మంగళవారం చివరి రోజు కావడంతో బాబాను దర్శించుకోవడం కోసం, సర్వ పాపాలను హరించి వేస్తుందని నమ్మే ఆయన పాదధూళి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
80 వేల మందికి అధికారులు అనుమతి ఇవ్వగా 2.5 లక్షల మందికి పైగా వచ్చినట్లు పోలీసు అధికారులే చెబుతున్నారు. కార్యక్రమం ముగిసి బాబా కారులో వెళ్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకు రావడం, బాబా అనుచరులు నెట్టి వేయడం తొక్కిసలాటకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలనుబట్టి తెలుస్తున్నది. సమావేశం జరిగిన ప్రదేశం చిన్నది కావడం, అంచనాకు మించి జనం రావడంతో ఉక్కపోత ఏర్పడి జనం గేట్లవైపు పరుగులు తీశారు. దీంతో పలువురు కిందపడిపోయారని మరో వర్గం కథనం. ఇలా ఊపిరి ఆడక పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. మైదానం చిత్తడిగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ఓ భక్తుడు చెప్పాడు.
ఇంతకీ ఈ ‘భోలే బాబా’ ఎవరు? ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన నారాయణ్ సాకార్ హరి అలియాస్ సాకార్ విశ్వ హరి ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు చెప్పుకొనే ఈయన 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టారు. అలీగఢ్‌తోపాటు హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఈయనకు లక్షల సంఖ్య లో అనుచరులున్నారు. కోవిడ్ కాలంలో ఈయన పేరు దేశమంతటికీ తెలిసింది. ఆ సమయంలోనూ ఈయన సత్సంగ్‌లు నిర్వహిం చారు. ఆధ్యాత్మిక బాట పట్టడానికి ముందు లైంగిక వేధింపుల ఆరోపణలపై కొన్నాళ్లు జైలుకు వెళ్లి వచ్చారు.
ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈయన ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు కూడా లేనట్లు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి విషాదా లు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 340 మంది చనిపో యారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా ఆలయంలో 250 మంది, హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి ఆలయంలో అదే ఏడాది జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో కేరళలోని పులి మేడు వద్ద అయ్యప్ప భక్తుల తొక్కిసలాటలో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏడాది ఎక్కడో ఒకచోట ఇలాంటి తొక్కిసలాట ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇలాం టి వాటిని నివారించడానికి ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఇలా కొనసాగాల్సిందేనా?