calender_icon.png 23 December, 2024 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహోన్నత జాతిరత్నం

11-10-2024 12:00:00 AM

శ్రద్ధాంజలి :

భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం నేలకొరిగింది. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. వృద్ధాప్య సంబంధమైన ఆరోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 86 ఏళ్ళ వయస్సులో తుదిశ్వాస విడిచారు.

రతన్ టాటా వ్యాపారవేత్తగా ఎంతగా రాణించారో వేరేగా చెప్పనక్కర్లేదు సంపాదనలోనే కాదు ఆయన సంఘానికి చేసినసేవలు అద్భుతం. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినవాడు రతన్ టాటా.

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా. జంషెడ్జీ టాటా కొడుకు రతన్‌జీ టాటాకు పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తిని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు. నావల్ టాటా కొడుకు రతన్ టాటా.  రతన్ తండ్రి నావల్‌ది సూరత్ (గుజరాత్)లో దిగువ మధ్య తరగతి కుటుంబం.

నాలుగేళ్ల్ల వయస్సులోనే తండ్రి చనిపోతే తల్లి కుట్టుమిషన్‌తో వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించలేక ఒక అనాధాశ్రమం లో చేర్పించారు నావల్‌ని. పిల్లలు లేని రతన్‌జీ టాటా భార్య నావల్‌ని దత్తత తీసుకోవటంతో నావల్ టాటా అయ్యారు. నావల్ టాటా, సోను దంపతులకు రతన్ టాటా 1937 డిసెంబర్ 28 న ముంబైలో పుట్టిన పదేండ్ల తర్వాత ఆయన తల్లి తండ్రులువిడిపోయారు.

తల్లిదండ్రులు విడిపోయాక రతన్ టాటా,  సోదరుడు జిమ్మి  నానమ్మ నవాజ్ భాయి సంరక్షణలో  పెరిగారు. రతన్ టాటా జీవితంలో కష్టాలు లేవని,  గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని అనుకుంటాం. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆయన ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు. తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోమనేవాడు.

చివరికి తాతని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీలో తనకిష్టమైన బీఆర్క్‌లో డిగ్రీ చేశారు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ తాత ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చారు. ఆ సమయంలో భారత్ , చైనా యుద్ధం జరుగుతుండటంతో ప్రేమించిన అమ్మాయి భారత్ రాలేకపోయింది.  ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా బ్రహ్మచారిగానే మిగిలిపోయారు.

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు వరుసకు సోదరుడి కుమారుడు జేఆర్‌డీ టాటా. రతన్ టాటా ఇండియా వచ్చిన సమయంలో ఆయనే టాటా గ్రూపు వ్యాపారాలను చూసుకునేవారు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగిలాగే టాటా గ్రూపులో జాయిన్ అయ్యాడు. జేఆర్‌డీ టాటా ఆరోగ్యం బాగాలేని స్థితిలో రతన్ టాటాకు టాటా గ్రూపు పగ్గాలు అప్పగించారు.

అప్పటిదాకా కుటుంబ వ్యాపారంలాగా ఉన్న టాటా సంస్థను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు రతన్ టాటా. ఇండియాలో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొన్నారు కానీ తనకారును ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వారు. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారుని చెక్ చేపించుకునేవాడు. 

రతన్ టాటా 1991 లో టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన బాధ్యతలు స్వీకరించే సమయానికి కంపెనీ రెవెన్యూ పదివేల కోట్లుగా ఉంది. ఆ తర్వాత రతన్ టాటా అంతర్జాతీయ స్థాయిలో కంపెనీని విస్తరించారు స్టీల్, ఆటోమొబైల్ రంగాల్లో విస్తరించడం, కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి ఏకంగా కంపెనీ రెవెన్యూ లక్ష కోట్లకు చేర్చారు. 

సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకు వినియోగిస్తుంటారు రతన్ టాటా. తొలి భారతీయ కారు‘టాటా ఇండికా’ వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్‌కు వెళ్లి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్లు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు  భారత్ వచ్చిన వాళ్లను సాదరం గా ఆహ్వానించి వాళ్ల లగ్జరీ కార్లు అయిన జాగ్వార్, లాండ్ రోవర్‌ని కొని సహాయం చేశాడు రతన్ టాటా. సామాన్యుడి కారుగా గుర్తింపు పొందిన లక్ష రూపాయల కారు‘ నానో’ ఆయన డ్రీమ్‌ప్రాజెక్టు. ఉక్కు నుంచి ఉప్పు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు.

ఏ రంగ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూపు ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసమాన్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా మానవతావాదిగా పేరు గడిచిన రతన్ టాటా ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంది. రతన్ టాటా ఎప్పుడు లాభాలకంటే చిత్తశుద్ధికి  ప్రాధాన్యం ఇచ్చారు.

అదే ఆయనకు అపార గౌరవాన్ని సాధించి పెట్టింది. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడం అనే కాదు దాతృత్వంలోనూ ఎప్పుడు ముందుంటారు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్ట్‌ల ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. 2008లో ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రవాద దాడి జరిగింది ఆ సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత మరువలేనిది.

హోటల్ సిబ్బందితోపాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చి వారిని ఆదుకున్నారు. కరోనాలాంటి సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. భూరి విరాళం ప్రకటించారు.టాటా స్టీల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు.

అంతేకాదు ఆసియాలో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటాలే ప్రారంభించారు. సాల్ట్ నుండి సాప్ట్‌వేర్ వరకు టాటా గ్రూపు అన్ని రంగాల్లో విస్తరించింది. రతన్ టాటా 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అందుకున్నారు. 2023లో మహారాష్ట్ర ఉద్యోగరత్నతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్ ను అవార్డులను రతన్ టాటా అందుకున్నారు.

భరత్ చౌహాన్