22-04-2025 12:36:57 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): పదేళ్లుగా అభివృద్ధికి నోచుకో కుండా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన రహదారులని గుర్తించి హ్యామ్ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల పనులను వేగవంతం చేయాలని సూచించారు. హ్యామ్ పద్ధతిలో ఫేజ్-1లో 5,189 కి.మీ.ల రహదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు. అందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియలో భాగంగా డీటెయిల్డ్ ఎస్టిమేషన్లను సిద్ధం చేయాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి ప్రణాళిక 2025-26కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్యామ్ రోడ్లపై సమగ్ర సమీక్ష చేసి కేబినెట్ ఆమోదం అనంతరం పనులు ప్రారంభిస్తామని వివరించారు.