చుట్టూ ప్రకృతి అందాలు, అడవులు, ఆలయాలు, పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూస్తే ప్రతి ఒక్కరు మైమరిచిపోవాల్సిందే. అంత బాగుంటుంది.. సెలవులు, వీకెండ్ రోజుల్లో ఇక్కడ పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్.
అనంతగిరి హిల్స్‌లో తెలంగాణ టూరిజం శాఖ వారి హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్ ఉంది. అక్కడే స్టే చేయవచ్చు. అది కాకుండా ప్రవేట్ రిసార్టులు కూడా ఉన్నాయి. అనంతగిరి హిల్స్ చేరుకునే పర్యాటకులు ముందుగా.. ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోనేరుకు మెట్ల మార్గం కొద్దిసేపు సేద తీరుతారు.
ఆ తర్వాత అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఉంటుంది. అది టెంపుల్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లి.. ఎత్తున కొండపై నుంచి సీనరీస్, లాండ్ స్కేప్స్ చూడవచ్చు. పంట పొలాల్లోంచి వెళ్లే రైళ్లను కూడా చూడొచ్చు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ శివాలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయం దగ్గర పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతారు.
ఇక్కడే చాలా సేపు సేద తీరుతారు. అక్కడి నుంచి బుగ్గ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లవచ్చు. ఇది ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కోనేరులో 500 ఏళ్లుగా స్వయంగా ప్రవహిస్తున్న గంగను చూడొచ్చు. ఈ ఆలయానికి ఎడమవైపు నుంచి కోట్‌పల్లి రిజర్వాయర్‌కి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉంది. కోట్‌పల్లి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అక్కడికి వెళ్లి బోటింగ్ ఎంజాయ్ చేయవచ్చు. సొంత వాహనం లేని వారికి బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆలయం, కోట్‌పల్లి రిజర్వాయర్‌కి వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలు ఉంటాయి. ఇలా ఒకే రోజులో అనంతగిరి హిల్స్‌లో ఎన్నో చూడొచ్చు.
తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి అనంతగిరి(వికారాబాద్)కు ‘బ్యాక్ వన్ డే టూర్ ప్యాకేజీ’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ ట్రిప్‌కు వెళ్తే చాలు ఒక్కరోజులో అనంతగిరి హిల్స్ చూడొచ్చు.
ఎలా వెళ్లాలి: ఇది హైదరాబాద్‌కి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. సొంతంగా కారు, బైక్ ఉన్నవారికి ఈ టూర్ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. లేదంటే ట్రైన్ లేదా బస్సులో వెళ్లవచ్చు. సికింద్రాబాద్ నుంచి ఉదయం ఎనిమిది గంటల తర్వాత వికారాబాద్ వెళ్లే రైళ్లు రెండు ఉంటాయి. వాటిలో వికారాబాద్ చేరుకోవచ్చు. లేదంటే ఎమ్‌జీబీఎస్ బస్సుస్టాండ్ నుంచి వికారాబాద్‌కు బస్సులు ఉంటాయి. వికారాబాద్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్‌కి మరో బస్సు లేదా షేర్ ఆటోలు ఉంటాయి.