బాపూఘాట్‌లో అంజలి ఘటించిన గవర్నర్, సీఎం, స్పీకర్, మంత్రులు
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి)/కార్వాన్: జాతిపిత మహాత్మాగాంధీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఘనంగా నివాళి అర్పించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లోని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం బాపూఘాట్‌లోని ఆడిటోరియంలో వివిధ మతాల పెద్దలతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత బాపూఘాట్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ అహిం సా అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని కొనియాడారు.
నేటి యువత గాంధీజీ కన్న కలలను సాకారం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌రావు, షబ్బీర్ అలీ, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ డాక్టర్ జితేందర్,
హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉస్మాన్ బిన్ అల్ హాజరి, చంటిబాబు, కూరాకుల కృష్ణ, రఘుపాల్‌రెడ్డి, పరమానందం, ఆకుల చంద్రశేఖర్, టూరిజం జీఎం సూర్యప్రకాశ్, కార్వాన్ డిప్యూటీ కమిషనర్ శశికళ, గోల్కొండ తహసీల్దార్ అహల్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ సాధనలో గాంధీ స్ఫూర్తి: కేసీఆర్
తెలంగాణ రాష్ర్ట సాధనలో, స్వరాష్ర్ట పదేండ్ల ప్రగతిలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని మాజీ సీఎం- కేసీఆర్ పేర్కొన్నారు. సహనంతో శాంతియుత పంథా ద్వారా మాత్రమే గమ్యాన్ని చేరుకోగలమని, ప్రపంచానికే గాంధీజీ కార్యాచరణ అనుసరణీయమన్నారు.
పరాయిపాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి గాంధీజీ అనుసరించిన శాంతియుత పోరాట పంథా, ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలకు స్వయంపాలనకు మార్గదర్శకంగా నిలిచిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికందించిన సేవలను, చేసిన త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.