calender_icon.png 23 October, 2024 | 8:57 PM

ఘనంగా గణేశుని శోభాయాత్ర

18-09-2024 01:29:37 AM

  • భక్తజన సంద్రంగా భాగ్యనగర వీధులు 
  • సుమారు 1.40 లక్షల విగ్రహాల నిమజ్జనం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్, బాలాపూర్ మహాగణపతులు

* యువతీ యువకుల కేరింతలు..  చిన్నారుల చిందులు.. కళాకారుల కోలాటాలు.. నృత్య విన్యాసాలు..  వాద్యకారుల మేళతాళాలు, ఇసుకేస్తే రాలనంత భక్తులతో.. మంగళవారం మహానగరం హోరెత్తింది. గణేశుని శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.      

  1. లడ్డూల వేలం.. కేక!
    బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్  1.87కోట్లు 
  2. బాలాపూర్ వినాయక కమిటీ 31.10లక్షలు
  3. మాదాపూర్ మై హోం భుజ 29లక్షలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మహానగరంలో మంగళవారం జరిగి న గణపతి నిమజ్జన మహోత్సవా లను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు కదలివచ్చారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా 70 అడుగుల ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్‌తో పాటు ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ వంతెన, తెలుగుతల్లి ఫ్లుఓవర్ కిటకిలాడుతూ కనిపించించాయి.

అలాగే బాలాపూర్ నుంచి తరలివచ్చే బాలాపూర్ గణపతిను చూసేందుకు వచ్చిన భక్లుతో కేశవగిరి, చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ప్రాం తాలు కిక్కిరిసి కనిపించా యి. అధికారులు విగ్రహాల నిమజ్జనానికి మొత్తం 73 ప్రాంతాల్లో చెరువులు, కృత్రిమ పాండ్స్ ఏర్పాటును చేశారు. చెరువుల్లో ముఖ్యమైనవి హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు, మిరాలం ట్యాంక్, కాప్రా ఊరచెరువు. 73 నీటి వనరుల్లో 24 పార్టబుల్ పాండ్స్, 22 ఎక్స్‌వేషన్ పాండ్స్, 27 బేబీ పాండ్స్. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 10 కంట్రోల్ రూమ్‌ల నుంచి అధికారులు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలుగు తల్లిఫ్లు ఓవర్, సచివాలయం ప్రాంతాల్లో పైనుంచి కొందరు డ్రోన్లు ఎగురవేయగా పోలీసులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

సిబ్బంది సేవలు ఇలా..

మహానగర వ్యాప్తంగా 15 వేల మంది ఇంజినీరింగ్, శానిటేషన్, యూబీడీ, యూసీడీ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు (మూడు షిఫ్ట్‌ల్లో) నిమజ్జనోత్సవ విధుల్లో పాల్గొన్నారు. మొత్తం 468 క్రేన్ల సాయంతో అధికారులు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. 33 చెరువుల పరిధిలో 270 మంది గజ ఈతగాళ్లు అత్యవసర సేవలు అందించారు. క్రేన్ వర్కర్లు 24 గంటల పాటు నిమజ్జనంలో పాల్గొంటున్నందున, వారు విశ్రాంతి తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా సుమారు ౧.౪౦ లక్షల విగ్రహాల నిమజ్జనం జరిగింది.

వేడుకలను పర్యవేక్షించిన సీఎం రేవంత్

ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న విగ్రహాల నిమజ్జన ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. అలా తెలంగాణ వచ్చిన తర్వాత గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న తొలి సీఎంగా ఆయన అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. సీఎం వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, మేయర్ విజయలక్ష్మి ఉన్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతం

ఖైరాతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జన శోభాయాత్ర తెల్లవారుజామునే ప్రారంభమైంది.  ముందు రోజు అర్ధరాత్రి నుంచే నిర్వాహకులు చివరి పూజలు గావించారు. తెల్లవారిన తర్వాత టాస్క్‌ఫోర్స్, పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రెండంచెల రోప్ విధానంలో శోభాయాత్ర ప్రారంభించారు. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లుఓవర్, సెక్రటేరియట్ మీదుగా శోభాయాత్ర సాగింది. మధ్యాహ్నం సరిగ్గా 1.39 గంటలకు మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.  

పోలీసుల భారీ బందోబస్తు..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయి. ముఖ్యమైన ఏరియాల్లో ఉత్సవ కమిటీల సాయంతో నిమజ్జన శోభాయాత్రనులప్రశాంతంగా ముగిం చారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్‌శాఖ మొత్తం 67 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించింంది.  నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని ముందుగానే ప్రకటించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో శోభాయాత్ర, ట్యాంక్‌బండ్ పరిసరాలను పర్యవేక్షించారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని సీపీ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు.  షిఫ్టుల వారీగా ప్రజలకు సేవలందింని 25 వేల మంది పోలీసులకు అభినందనలు తెలిపారు.

నేడు క్లీనింగ్..

హుస్సేన్ సాగర్‌లో వినాయకుల నిమజ్జనం అనంతరం నగర వ్యాప్తంగా రహదారులన్నీ క్లీన్‌గా ఉండేలా జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకున్నది. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్, ఎన్టీయార్ మార్గ్, నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా తదితర ప్రాంతాలలో నిమజ్జనం అనంతరం వ్యర్థాలను తొలగించేందుకు బుధవారం 500 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. 

మెట్రో రైళ్లు కిటకిట

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్17 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. వారం రోజుల నుంచి ప్రతిరోజు 5లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణాన్ని సాగించారు. అదనపు సర్వీసుల్లో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణించి ఉంటారని తెలుస్తున్నది. నిమజ్జనోత్సవం రోజు ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సుమారు 25వేల మంది ప్రయాణించి ఉంటారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో మెట్రోలో 15లక్షల మందికి పైగా ప్రయాణించి ఉంటారని చెప్తున్నారు. మెట్రోకి అనూహ్య స్పందన వచ్చింది.

మంత్రి పొన్నం ‘ఏరియల్ వ్యూ’ పర్యవేక్షణ

 మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి, సీపీ సీవీ ఆనంద్‌తో హెలికాఫ్టర్‌లో ప్రయాణించి ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనోత్సవాలను వీక్షించారు. జల మండలి అధికారులు నగరవ్యాప్తంగా 122కేంద్రాల్లో భక్తులకు ఉచితంగా మంచినీటి సౌకర్యం కల్పించారు.

భక్తసంద్రం.. బాలాపూర్ 

బాలాపూర్ గణనాథుడి శోభయాత్ర ఉదయం 6.15 గంటలకే ప్రారంభమైంది. నిర్వాహకులు గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. లడ్డూను రూ.31,11,116 కు పాడి శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. అలాగే మైహోంభూజాలో రెండు రోజుల కిందట నిర్వహించిన లడ్డూ వేలాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. లడ్డూలో సగం ప్రజలకు పంపిణీ చేసి, మిగతా సగాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చేరవేస్తామని గణేశ్ తెలిపారు. అనంతరం శోభా యాత్ర సుమారు 16 కిలోమీటర్ల సాగింది. సాయంత్రం 4.10 గంటలకు గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 2020లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లడ్డూవ వేలాన్ని దక్కించుకున్నారు. 2021లో రమేష్ యాదవ్/మర్రి శశాంక్‌రెడ్డి రూ.18,90,000, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24,60,000, 2023లో దాసరి దయానంద్ రెడ్డి రూ. 27,00,000 కు పాడి లడ్డూ వేలాన్ని దక్కించుకున్నారు.


రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

రాజేంద్రనగర్, సెప్టెంబర్17: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీలోని రిచ్‌మండ్ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.౧.87 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడి లడ్డూ రూ.కోటి 26 లక్షలు పలికిందని నిర్వాహకులు తెలిపారు. రిచ్‌మండ్ విల్లాస్‌లో అన్నీ ప్రత్యేకమే అని చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఎవరైనా లడ్డూ వేలంలో పాల్గొనవచ్చు. హిందువులు, ముస్లింలు, సిక్‌లు, క్రిస్టియన్లు పాల్గొనేలా నిర్వాహకులు వెసులుబాటు కల్పించారు.

11రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈనేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల వరకు ఇక్కడ లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఆర్‌వీ దియా గ్రూపు లడ్డూను దక్కించుకుంది. ఇక్కడ అందరూ కలిసి ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసుకున్నారు. లడ్డూ వేలంలో వచ్చిన డబ్బును పేద విద్యార్థుల చదువుతోపాటు అనారోగ్య సమస్యల ఖర్చు కోసం వినియో గించడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఓ వీడి యో విడుదల చేశారు. రిచ్‌మండ్ విల్లాస్ నిర్వాహకులు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.