06-04-2025 08:18:05 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూరు గ్రామంలో ఆదివారం పెద్దమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు గ్రామస్తులు వేరువేరుగా ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నూతన వస్త్రాలు ధరించి, అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని డీజే చప్పుళ్ల మధ్య శివ సత్తులు నృత్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాల వరకు వెళ్లారు. అనంతరం ఆలయాల చుట్టూ బోనాలు ఎత్తుకొని ప్రదక్షిణలు నిర్వహించి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ... పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.