calender_icon.png 8 November, 2024 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన స్నేహిత్

18-06-2024 01:01:01 AM

కజన్ (రష్యా): అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ ప్యాడ్లర్ ఆర్. స్నేహిత్ సత్తా చాటాడు. రష్యా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్ 2024లో టేబుల్ టెన్నిస్ (టీటీ) విభాగంలో స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9 8 6 రష్యాకు చెందిన కిరిల్ స్కచోవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. మ్యాచ్‌లో ప్లాంక్ షాట్లతో అలరించినప్పటికీ ప్రత్యర్థి అనుభవానికి తలవంచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన స్నేహిత్ ఏమాత్రం అధైర్యపడకుండా బ్రిక్స్ గేమ్స్‌లో బరిలోకి దిగాడు.

టోర్నీ ఆద్యంతం మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన స్నేహిత్ తొలి రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్ వరకు తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 97 దేశాల నుంచి 4వేలకు పైగా అథ్లెట్లు పాల్గొన్న బ్రిక్స్ గేమ్స్‌లో మన హైదరాబాదీ స్థిరమైన ప్రదర్శనతో భవిష్యత్తుకు భరోసాగా నిలిచాడు. ‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. సెమీఫైనల్ వరకు మంచి రిథమ్‌తో కనిపించా. కానీ కీలక మ్యాచ్‌లో కిరిల్‌ను అతని సొంత ప్రేక్షకుల మధ్య ఓడించేందుకు ప్రయత్నించా.

కానీ ఈరోజు మ్యాచ్‌లో నాకన్నా మంచి ప్రదర్శన కనబరిచాడు. పారిస్ బెర్త్ తృటిలో కోల్పోయినప్పటికీ ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని స్నేహిత్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. కాగా స్నేహిత్ ప్రస్తుతం తెలంగాణ ప్యాడ్లర్ ఆకుల శ్రీజతో కలిసి సోమనాథ్ ఘోష్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.