calender_icon.png 30 November, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాకు బంగారు పంట

30-11-2024 03:38:22 AM

1000 టన్నుల బంగారు నిక్షేపాలు గుర్తింపు

బంగారం విలువ రూ.7లక్షల కోట్లు ఉంటుందని అంచనా

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా రికార్డు

బీజింగ్, నవంబర్ 29: చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు బయటపడ్డాయి. మధ్య చైనాలోని పింగ్‌జియాంగ్ ప్రాంతంలో ఉన్న వాంగ్‌జు గోల్డ్ ఫీల్డ్‌లో దాదాపు 2 కిలోమీటర్ల లోతులో సుమారు 1000 మెట్రిక్ టన్నుల మేలిమి బంగారం నిల్వలను జియాలజిస్టులు తాజాగా గుర్తించారు. ఈ బంగారం విలువ 83 బిలియన్ డాలర్లు(రూ.6.91లక్షల కోట్లు) ఉంటుందని జియాలాజికల్ బ్యూరో అంచనా వేసింది.

వాంగ్‌జు గోల్డ్ ఫీల్డ్‌లో డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు కనిపించినట్టు వెల్లడించింది. 2000 మీటర్ల రేంజ్‌లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ను ధాతువులో సుమారు 138 గ్రాముల మేలిమి బంగారం ఉంటుందనే విషయం శాంపిళ్ల ద్వారా వెల్లడైందని చెప్పింది. ఈ నిల్వలను కనుగొనడం కోసం 3డీ జియోలాజికల్ మోడలింగ్ వంటి అధునాతన సాంకేతికను ఉపయోగించినట్టు తెలిపింది. 

రికార్డు బద్దలు కొట్టిన చైనా

ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గనిగా దక్షిణ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ గుర్తింపు పొందింది. ఇక్కడ 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. అయితే ఈ స్థానాన్ని చైనాలోని వాంగ్‌జు గోల్డ్ ఫీల్డ్ ఆక్రమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా గుర్తింపు పొందింది. 


చైనా ఆర్థిక వ్యవస్థకు మరింత బలం

బంగారం సరఫరాలో చైనా ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. 2023లో ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు 10శాతం బంగారాన్ని ఈ దేశమే ఉత్పత్తి చేసింది. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు బయటపడటం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరనుంది. అత్యాధునిక చిప్‌లను తయారు చేయడానికి అమెరికాతో డ్రాగన్ కంట్రీ పోటీ పడుతోంది. చిప్‌ల తయారీలో బంగారాన్ని కూడా ఉపయోగిస్తున్నందున చిప్‌ల తయారీ రంగం ఆ దేశంలో మరింత పుంజుకోనుంది.