29-03-2025 12:00:00 AM
ప్రపంచ జనాభా లెక్కల్లో మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రమాదకరంగా మారుతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభు త్వం యువతలో వికాసం నింపే చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రై వేట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతూనే మరోవైపు యువత సొంత కాళ్లమీద నిలబడి వ్యాపారం చేస్తూ వారే మరికొందరికి ఉపాధి కల్పించేలా ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని యువతకు భారీగా స్వయంఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకాన్ని తెచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు రుణాలను అందించనుంది.
సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకు న్న తెలంగాణలో యువత పాత్ర కీలకమైం ది. తెలంగాణ ఉద్యమంలో ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ నినాదంలో నియామకా లు అంశానికి ఆకర్షితులైన యువత బలిదానాలకూ వెనకాడలేదు. సొంత రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు అయినా ఆశించిన మేర కు ఉద్యోగ కల్పన జరగలేదనే అసంతృప్తి వారిలో ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ నియామకాలతోపాటు యువతను, మహిళలను స్వయంఉపాధి దిశగా నడిపించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అధిక జనాభా ఉన్న మన దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఆశించిన వారందరికీ ఉపాధి కల్పిం చడం ఆచరణలో అసాధ్యం. అయితే, నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న యువతకు న్యాయం చేయడంతోపాటు వారిలో భవిష్యత్ భరోసా కల్పించే బాధ్యత కూడా త మపై ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవడం స్వాగతించాల్సిన అంశం. ఇప్పటికే ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘రాజీవ్ యువ వికా సం’ పథకం తేవడంతో రాష్ట్రంలో స్వయంఉపాధి రంగం మరింత పుంజుకుంటుంది.
కోటిమంది కోటీశ్వరులుగా..
తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో స్వశక్తి మహిళా సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ది. ఇంటింటికీ తిరిగి మహిళలను సంఘం లో సభ్యులుగా చేర్పించేందుకు కృషి జరుగుతున్నది. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్షకోట్ల రూపాయలు, ఏటా ఐదువేల గ్రా మ సంఘాలకు ఐదువేల కోట్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిం చింది. మహిళా సంఘంలో చేరిన ప్రతి మ హిళకు రూ.15.50 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్‌లు, క్యాంటీన్లు ప్రారంభించడంతోపాటు ఇతర వ్యాపారాల్లో వారిని ప్రోత్సహిస్తున్నది. కుట్టు మిషన్ సహా ఇత ర 15 వ్యాపారాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నది. కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయనుంది. మహిళా సంఘాల ఆధ్వర్యం లో 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం మహిళా సంఘాలతో నగరంలోని శిల్పారామంలో 100 షాపులు ఏ ర్పాటు చేసింది. వారు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. మహిళా సాధికారతకు స్వయంఉపాధి కల్పించి ప్రోత్సహించడంలో విజయవంతమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు యువతకు స్వయంఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన ఏడాదిన్నర కాలంలో నిరుద్యోగాన్ని ప్రధానాంశంగా పరిగణించి వివిధ శాఖ లు, స్థాయిల్లో 58 వేలకు పైగా నియామకాలు చేపట్టారు. మరో 55 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో మొత్తం లక్ష పదివేలకు పైగా ఉ ద్యోగాల ప్రక్రియ చేపట్టినట్టయ్యింది. నెల ల వ్యవధిలోనే పలు ప్రభుత్వ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చే స్తోంది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో రద్దయిన, వాయిదా పడిన నోటిఫికేషన్లలో మరిన్ని పోస్టుల సంఖ్యను పెంచి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ భర్తీ ప్రక్రియేకాక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని స్థాపించడంతో రాష్ట్రం లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడి కో సం ముందుకు వచ్చాయి. ఈ రకంగా ఉ ద్యోగాలకు భారీ అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేకాక యువతలో ఉపాధి కోసం నైపుణ్యం పెంపొందించేందుకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’, అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు, డిగ్రీ విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభించారు. దీంతో తెలంగాణ యువత నేటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడం సులభమవుతోంది.
విప్లవాత్మక నిర్ణయాలు
ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం రా ష్ట్రంలో 2023 జులైఙై కాలంలో నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉండగా, 2024 జులై - సెప్టెంబర్ కాలానికి అది 18.1 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, పరిశ్రమలు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్న ప్రభుత్వం నైపుణ్యం కోసం చర్యలు చేపడుతూనే యువతకు స్వయంఉపాధి కల్పించేందుకు భారీ ప్రణాళికలతో ‘రాజీవ్ యువ వికా సం’ పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యుసీ యువత కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రి య ప్రారంభమైంది. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేసి, అర్హులైన వారికి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వర కు ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేయనుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయనుంది.
‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యుసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేస్తారు. సంబంధిత జిల్లా మంత్రి, కలెక్టర్లు తుది ఎంపిక జరుపుతారు. స్వయంఉపాధి కోసం దరఖాస్తు చేసుకునే వారి యూనిట్ల విలువలనుబట్టి రాయితీలు ఇస్తారు. రూ.50 వేల వరకు వంద శాతం రాయితీ, రూ.50 వేల నుండి రూ.లక్ష వరకు అయితే 90 శాతం రా యితీ, మిగతా పది శాతం బ్యాంకు రుణం, రూ. 1 లక్ష నుండి రూ.2 లక్షల వరకైతే 80 శాతం రాయితీ, 20 శాతం బ్యాంకు రుణం, రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకైతే 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం, వల్నరబుల్ గ్రూపుల కోసం లక్ష రూపాయలకు వంద శాతం రాయితీ, మైనర్ ఇరిగేషన్‌కు వంద శాతం రాయితీ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిరు వ్యాపారాలు చేసుకోవా లనే వారికి పూర్తి రాయితీ ఇవ్వడం ఈ పథకంలో పెద్ద ఉపశమనం. మరోవైపు మైనర్ ఇరిగేషన్‌కు కూడా వంద శాతం రాయితీ ఇచ్చింది.
అత్యధిక కుటుంబాలకు చేయూత
స్వయంఉపాధి పథకంలో ఉద్యమకారులకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయిస్తా రు. ఇందులో ఒంటరి, వితంతు మహిళల కు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికీ ప్రాధాన్యం ఉంటుంది. వికలాంగులకు 5 శాతం ప్రత్యే క రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. సంబంధిత స్వయంఉపాధి రంగంలో నైపుణ్యతతోపా టు అనుభవం ఉన్న యువతకు అధిక ప్రా ధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే పథకం మంజూరు చేయాలని నిర్ణయించడంతో వీలైనన్ని ఎక్కువ కుటుంబా లకు ఆర్థిక సహాయం అందనుంది. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వమే సంబంధిత రంగాల్లో తగిన శిక్షణకూడా ఇస్తుంది. వ్య వసాయ ఆధారిత పథకాలకు గరిష్ట వయ స్సు 60 ఏళ్లుగా నిర్ణయించారు. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న ప్రస్తుత దశలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ అసంతృప్తితో నిరాశ నిస్పృహలకు లోనవుతు న్న యువతకు ‘రాజీవ్ యువ వికాసం’ ఆశాదీపంగా మారనుంది. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం అసాధ్యమైన నేటి కాలంలో సొంత కాళ్లపై నిలబడడమే కాకుండా వారే మరి కొంతమందికి ఉపాధి కల్పించేలా స్వయంఉపాధి పథకానికి ప్రభుత్వం పూనుకోవడం అభినందనీయం.
-ఐ.వీ.మురళీ కృష్ణశర్మ