యాదాద్రి భువనగిరి, జూలై 15 (విజయక్రాంతి) : ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో సోమవారం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగాయి. విశ్వశాంతి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలతో 108 కలశాలను వేదయుక్త మంత్రాలతో పూజించి స్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు హోమ పూజలు జరిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలు, హరి సంకీర్తనలతో గిరి ప్రదక్షిణలు చేశారు. దాదాపు 10 వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ధర్మకర్త బీ నర్సింహ మూర్తి, ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.