యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (విజయ కాంతి): యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో మంగళవారం రోజు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి నిత్య కైంకర్యములలో భాగంగా నేటి వేకువ జామున సుప్రభాత సేవతో మొదలుకొని అన్ని కార్యక్రమాలు శ్రీ శ్రీ శ్రీ రామానుజ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శ్యాసనాలతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యుల నేతృత్వంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ధర్మకర్త మానేపల్లి రామారావు మాట్లాడుతూ ముందుగా ఆలయానికి విచ్చేస్తున్న భక్తులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భూమిపై జీవరాసులు సుభిక్షంగా మనగలుగుతున్నయంటే అందుకు కారణం సూర్యుడు.
ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు.
ఈ సందర్భంగా చైర్మన్ మానేపల్లి మురళీకృష్ణ మాట్లాడుతూ సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై దక్షణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారిని భక్తుల దర్శనార్థం మాడవీధులలో మేళ తాళాలు. మంగళ వాయిద్యాలతో మాడవీధులలో ఊరేగించారు.
సూర్యాపేటలో..
సూర్యాపేట ఫిబ్రవరి 4 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గల దేవాలయాల్లో ఆదిత్య ్రహ్రదయం స్తోత్రం పఠించి సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజారులో గల వేదాంత భజత మందిరంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్ర స్వామిని పూలతో అలంకరణ చేసి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో వేదాంత భజనమందిరం చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర రావు, దేవాలయ ప్రధాన అర్చకులు ధరూరి సింగరాచార్యులు, అర్చకులు రాఘవాచార్యులు, రామానుజా చార్యులు, ఆలయ కార్యదర్శి నకరికంటి నాగరాజు, కోశాధికారి సోమ సుమన్ తదితరులు పాల్గొన్నారు.