21-03-2025 01:33:12 AM
కాయ్ రాజా.. కాయ్ అంటూ కుటుంబాలను కాటేస్తున్న యాప్‌లు
హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, మార్చి 20 (విజయ క్రాంతి): కుటుంబాలను చిధ్రం చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోటర్లపై పోలీసులు కొరడా ఝులిపిస్తు న్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి న 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఈ నెల 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదుకాగా..
గురువారం మియాపూర్ పోలీసులు ఆరుగురు సినీనటులు, 19 మంది సోషల్‌మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైనవారిలో ప్రముఖ సినీనటులు ప్రకాశ్‌రాజ్, దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
అనన్య నాగళ్ల, సిరిహనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతచౌదరి, నయని పావని, నేహపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్, విష్ణు ప్రియ, హర్షసాయి, సన్నియాదవ్, శ్యామల, టేస్టీతేజ, రీతుచౌదరి, సుప్రిత ఉన్నారు. వీరిపై బీఎన్‌ఎస్ 318(4), 112ఆర్/డబ్ల్యూ, 49 బీఎన్‌ఎస్, 3,3(ఎ),4టీస్‌జీఏ, 66-డీ ఐటీఏ-2000-2008 కింద కేసు నమోదైంది.
స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్
బెట్టింగ్ యాప్స్‌పై విజయ్ దేవరకొండపై నమోదైన కేసులో ఆయన టీమ్ స్పందించింది. చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కానీ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశారనే రూమర్స్ ప్రసారమవుతున్నాయని, విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించిన ఆ కంపెనీలు చట్టప్రకారమే నడుస్తున్నాయని తెలిపారు.
ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఆయన ప్రచారకర్తగా పరిమితమయ్యారన్నా రు. ఆయన ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది తమ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.
ఆ కంపెనీ, ప్రొడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉందని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారని, అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు ఆయన బ్రాం డ్ అంబాసిడర్‌గా పనిచేశారని వెల్లడించారు.
రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు సైతం తెలిపిందన్నారు. ఏ 23 అనే కంపెనీతో ఒప్పందం గతేడాది ముగిసిందని చెప్పారు. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదని, విజ య్ విషయంలో పలు మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
9ఏండ్ల క్రితం యాడ్ చేశా.. ఆ కంపెనీకి నోటీసులు పంపా: ప్రకాశ్‌రాజ్
మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై ప్రకాశ్‌రాజ్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను ఓ షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు. 9ఏండ్ల కింద ఏడాది ఒప్పందంలో భాగంగా వీడియో చేశానని ఆ యాడ్‌పై చర్చ నడుస్తోందన్నారు. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాలి కదా, మీరెలా చేస్తారని పలువురు తనను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
2016లో ఓ యాడ్ వచ్చిందని, ఆ కంపెనీతో వీడియో చేసింది వాస్తవమని వెల్లడించారు. అది తప్పని తెలుసుకుని కొన్ని నెలలకే వదిలేశానని, 2017లో కాంట్రాక్ట్ పొడగించమని కోరినా తాను ఒప్పుకోలేదన్నారు. అది తప్పని తెలుసుకుని దాన్ని ప్రసారం చేయొద్దని కోరానని, ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్స్‌కు యాడ్ చేయలేదని స్పష్టం చేశారు.
2021లో ఆ కంపెనీ తన యాడ్‌ను మరో కంపెనీకి అమ్మిందని, వారు ఆ యాడ్‌ను వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపానని చెప్పారు. ఇప్పటివరకు పోలీసుల నుంచి తనకు ఏ సందేశం లేదని తెలిపారు.
నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు అంబాసిడర్‌గా ఒప్పందం: రానా టీమ్
బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాపై నమోదైన కేసులో ఆయన టీమ్ స్పందించింది. నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఒక కంపెనీతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందం గడువు 2017లో ముగిసిందని వెల్లడించింది.
ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం చెప్పారని పేర్కొంది. జూదానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గుర్తించిన ఆన్‌లైన్ గేమ్‌లను హైలెట్ చేయడం చాలా అవసరమని, ఈ గేమ్‌లు నైపుణ్యంపై ఆధారపడి ఉన్నాయని, అందువల్ల చట్టబద్ధంగా అనుమతించినట్లు కోర్టు చెప్పిందని పేర్కొంది.
విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరి
ఈ నెల 11న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆ కేసులో ఉన్న యాంకర్ విష్ణుప్రియ, నటి రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10.30 గంటలకు లాయర్‌తో స్టేషన్‌కు వచ్చిన విష్ణుప్రియను రాత్రి 9గంటల వరకు పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
తాను 15 బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అందుకోసం ఆమె భారీగా డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కో వీడియోకు రూ.90వేలు తీసుకున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు. విష్ణుప్రియ చెప్పిన వివరాలను రికార్డు చేసిన పోలీసులు ఆమె ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం నటి రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
ఎవరు చెబితే వీడియోలు చేశారు..? ఎంత డబ్బు తీసుకున్నారు..? అని ప్రశ్నించి వారి ఖాతా వివరాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌ల పేరిట వేల కోట్ల వ్యాపారం నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఈడీ దృష్టిసారించింది. యాప్‌లకు ప్రమోషన్స్ చేసిన లావాదేవీలపై దృష్టి సారించినట్లు, వారి ఖాతా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఈ కేసులో టేస్టీతేజ, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌ను పోలీసులు విచారించారు. మరో ఏడుగురు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాగా ఇప్పటికే వీరంతా ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయబోమని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
వారిపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన కేసులో పలువురిపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నియాదవ్, శ్యామ ల, టేస్టీతేజ, రీతు చౌదరి, సుప్రిత తదితరులపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్స్!
ప్రయాణికులు, నెటిజెన్ల విమర్శలు
హైదరాబాద్ మెట్రో రైళ్లలో పలు బెట్టింగ్ యాప్స్ యాడ్స్ రావడంపై ప్రయాణికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మెట్రో రైళ్లకు వేసిన యాడ్స్ స్టికర్లు, లోపల వేసిన స్టిక్కర్ల ఫొటోలు, వీడియోలపై విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీ మెట్రో యాజమాన్యంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్స్ నిర్వహించిన సినీతారలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు పెట్టారని, మెట్రో రైళ్లలో ప్రచారం చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను తొలగించాలి: ఎన్వీఎస్‌రెడ్డి ఆదేశం
కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలున్నట్లు తన దృష్టికొచ్చిందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ ప్రకటనలను గురువారం రాత్రే తొలగించాలని సంబంధిత అడ్వర్టుజ్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.