రూ.50 కోట్ల నాలాపై రూ.100 కోట్ల భవనం
కనుమరుగైన 3 వేల గజాల నాలా స్థలం
కళ్లు మూసుకున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
ఆక్రమణదారుడు ఓ నాయకుడికి బినామీగా ప్రచారం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 6: ఆ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ.2.50 లక్షలు. అక్కడే రూ.50 కోట్ల విలువైన అతి పురాతన నాలా ఉంది. ఆ నాలా విస్తరించి ఉన్న స్థలంపై ఓ ప్రజాప్రతినిధి కన్ను పడింది. తన బినామీ పేర నాలాపై పాగా వేశాడు. రూ.50 కోట్ల విలువైన నాలాపై ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రూ.100 కోట్ల విలువైన కమర్షియల్ భవనం నిర్మించాడు. అంతేకాదు.. ఆ భవనం ద్వారా ప్రతినెలా రూ.10 లక్షల వరకు అద్దె రూపంలో జమ చేసుకుంటున్నాడు.
ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కూతవేటు దూరంలో.. సైబరాబాద్‌కు దగ్గరగా.. రాజ్‌పుష్ప భవంతుల ముందు నార్సింగి చౌరస్తాలోనే ఆ అవినీతి మేడ ఉంటుంది. ‘ప్రభుత్వానికి నష్టం జరిగితే మాకేంటి మా జేబులు నిండితే చాలు’ అనుకున్నారేమో కానీ నార్సింగి మున్సిపల్, గండిపేట రెవెన్యూ అధికారులు ఆ అద్దాల మేడ వైపు కన్నెత్తి చూడటం లేదు. కానీ ఇది అతి పురాతన బుల్కాపూర్ నాలా స్థలం అని, నాలా స్థలంను ఆక్రమించి భారీ భవనం నిర్మించారని ఇరిగేషన్ డీఈ రమ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు సదరు ఆక్రమణదారుడు ఆ మేడకు అనుమతుల జారీ చేయాలని హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు.
ఇరిగేషన్ రికార్డుల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, గండిపేట మండలాల పరిధిలో బుల్కాపూర్ ఆ నాలా విస్తరించి ఉంటుంది. ఇరిగేషన్ రికార్డుల ప్రకారమైతే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ప్రచారంలో ఉన్న నార్సింగి చౌరస్తా పక్క నుంచే నాలా ప్రవహిస్తుండేది. నాలా విస్తరించి ఉన్న 3 వేల గజాల స్థలం (రోడ్డు వెంట పొడవుగా)పై కన్నేసిన ఆ నేత తన బినామీని రంగంలోకి దించాడు. దీనిపై సదరు ఆక్రమణదారుడు అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరాఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతులు రాలేదని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి విజయక్రాంతికి తెలిపారు.
సుమిత్ జైన్ పేరు మీద ఉన్న ఆ భవనానికి అనుమతులు లేకున్నా నార్సింగి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్ 1 ఇస్తూ రికార్డుల్లో నమోదు చేశారు. అలాగే ఏడాదికి రూ.4 లక్షల ఆస్తి పన్ను కూడా వసూలు చేస్తున్నారు. అనుమతులు లేని భారీ కమర్షియల్ భవనానికి విద్యుత్ అధికారులు ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు నల్లా కనెక్షన్ ఇచ్చారు. అక్రమ మేడపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నాలాలపై భారీ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించడంతోనే వానకాలంలో లోతట్టు కాలనీలు నీట మునుగుతున్నాయని వాపోతున్నారు. హైడ్రా నార్సింగి చౌరస్తాలో నాలా స్థలంపై నిర్మించిన భవనంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలా స్థలం కబ్జాపై గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా నార్సింగిలో నాలా స్థలం తమకు సంబంధం లేదని, నాలాల పర్యవేక్షణ, సంరక్షణ ఇరిగేషన్ శాఖ చూసుకోవాలని సమాధానమిచ్చారు.
కబ్జా జరిగింది నిజమే
నార్సింగిలో రాజపుష్ప ఎదురుగా నాలా స్థలం కబ్జాకు గురైంది అనే విషయం మా దృష్టికి వచ్చింది. నాలా పైనే భారీ భవనం వెలసింది. నాలా కబ్జాకు సంబంధించిన వివరాలను ఇప్పటికే మా ఉన్నతాధికారు లతో పాటు ప్రభుత్వానికి నివేదిం చాం. నాలాతో పాటు రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో కబ్జాకు గురైన నాలాలు, చెరువులపైనా నివేదిక ఇచ్చాం.
రమ, ఇరిగేషన్‌శాఖ డీఈ