ఆ అమ్మాయి కోసమే ఉదయాలు విప్పారతాయన్నట్లుగా
తెల్లవారక ముందే వీధుల్లో
ప్రత్యక్షమవుతుంది
పాలుగారే ప్రాయంతో
ఎంత నిర్మలంగా ఉంటుందో
బతుకు బాధ్యతను భుజాన మోస్తూ...
భూమాతకున్నంత సహనాన్ని
ప్రదర్శిస్తూ...
ఇంటా బయటా రోజుకెన్ని తిట్లు తింటుందో కాని చిరునవ్వుల్నే
ప్రతిగా రువ్వుతూ సాగుతుంటుంది
తనంత పొడుగు బస్తాను
భుజాన మోస్తూ...
అట్ట ముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, మందు సీసాలు
ఏవి దొరికినా ఆప్యాయంగా
బస్తాలోకి పంపుతుంది
ఇనుప వస్తువులేమైనా దొరికాయా...
పరమాన్నం దొరికినంత
సంబరపడుతుంది
వాటిని తడిమి తడిమి మురిసి
ముద్దవుతుంది
అంతలోనే ఎవడో బూతులు
లంకించుకుంటాడు
పొద్దున్నే నీ దరిద్రపు
మొహమేంటే ముం.....
ఆ ప్రవాహానికి అడ్డు కట్టలుండవు
మరికొన్ని గొంతులూ శృతి
కలుపుతాయి
ఆ అమ్మాయి మాత్రం
మౌనంగానే సాగుతుంటుంది
బాహ్యంగానే కాదు
అంతర్గతంగా కూడా...
లేచింది మొదలు ధ్యానం అంటూ
అలౌకికానందాల కోసం
వెంపర్లాడే వాళ్ళకన్నా
బాహ్యపు చెత్తను తొలగిస్తూ
మానసిక చెత్తను దరిచేరనీయని
ఆ అమ్మాయే
మహోన్నతంగా తోస్తుంది.
- వి.ఆర్. తూములూరి