calender_icon.png 19 April, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి ప్రతినిధిగా ఆడపిల్ల!

13-04-2025 01:22:52 AM

ఎన్ని చదువులు చదివినా, ఎంత నైపుణ్యం సాధించినా ఆడపిల్లల్ని సమానంగా భావించదు ఈ సమాజం. ఇంట్లో, ఆఫీసులో అధికారం ఉన్న పరిధి దాటన్వివరు. ఆమె చుట్టూ కనిపించని కంచెను నిర్మిస్తారు. దాంట్లో నుంచి బయటకు రానివ్వరు. మరొకరిని లోపలికి వెళ్లనివ్వరు. ఏదో రూపంలో వేధిస్తూనే ఉంటారు. అదే అదనుగా, సమాజం బలహీనురాలనే ముద్ర వేస్తుంది. వివక్ష చూపుతుంది. ఆ విపత్తును ముందే ఊహించింది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. ఈ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ప్రతినిధి ధనశ్రీ బ్రహ్మే తన అనుభవాలను పంచుకున్నారు. 

మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అనేది ఒక ఎన్జీవో. ఇది మహారాష్ట్రలోని పద్దెనిమిది గ్రామాల్లో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఇంటి తలుపు మీదా.. ఆ ఇంట్లోని బాలికల పేర్లతో నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేస్తోంది. ఆ ఆలోచన సానుకూల ఫలితాల్ని ఇస్తోంది. ‘ఇది లక్ష్మీదేవి ఇల్లు. ఇది రజియా ఇల్లు. ఇది క్రిస్టినా, మేరీల ఇల్లు..’ అంటూ ఆడపిల్లల్ని ఆ ఇంటి ప్రతినిధులుగా గుర్తిస్తోంది సమాజం. మా ప్రయత్నం చిన్నదే కావచ్చు. కాని ఆ ప్రభావం జీవితాల్ని మార్చేస్తుందని నమ్మకం ఉంది. 

ఇంటి తలుపులపై..

మహారాష్ట్రలోని కల్మేశ్వర్ కూడా దేశంలోని మిగిలిన గ్రామీణ ప్రాంతంలా కనిపిస్తుంది. గ్రామానికి చుట్టూ అనేక పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అయితే ఒక అంశం మాత్రం ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా చూపుతుంది. ఈ ప్రాంతంలోని 18 గ్రామాల్లో ప్రతి ఇంటి తలుపుపై అమ్మాయిల పేరు కనిపిస్తుంది. కల్మేశ్వర్ నగరం చుట్టూ 108 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో పనిచేసుకుని బతికేందుకు శాశ్వత ఆదాయ వనరులు ఏవి లేవు. అక్కడివారు కార్మికులు పనిచేస్తూ జీవిస్తుంటారు. వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు.

అది కూడా సరిగ్గా స్కూల్‌కు హాజరు కాకపోవడం, డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటాయి. ఆడ పిల్లల చదువే లక్ష్యంగా.. 1999లో వారికి సపోర్టుగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ స్థాపించాం. మా సంస్థ ద్వారా ఆడపిల్లల విద్యా, జీవన నైపుణ్యాలు బాగా మెరుగుపడ్డాయి. మా ఫౌండేషన్ నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు 23 రాష్ట్రాల్లోని 80 కంటే ఎక్కువ జిల్లాల్లో విజయవంతంగా పనిచేస్తుంది. ఇది ఆడపిల్లల జీవితాల్లో వెలుగు రేఖగా చెప్పవచ్చు. 

వివక్షపై ఉక్కుపాదం..

గత 30 ఏళ్లుగా లింగ వివక్ష సమస్యలపై పనిచేస్తున్నా అనుభవం నాకు ఉన్నది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితిలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా..   ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్న క్రమంలోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ముఖ్యంగా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమ్మాయిల పరిస్థితి ఘోరంగా, తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారని అర్థమైంది. అప్పటి నుంచి లింగ వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నా. దాంట్లో భాగంగా మహారాష్ట్రలోని కల్మేశ్వర్ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి చూశా. ఇప్పటికీ స్త్రీ, పురుష అసమానతలు అనేవి బలంగా ఉన్నాయి. కల్మేశ్వర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతున్నాయి. భౌగోళికంగా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు అవకాశాలు, అవసరాలు ఉంటాయి. కాని అమ్మాయిలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ముఖ్యం. 

18 గ్రామాల్లో..

అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఒక ఆలోచన తట్టింది. అదే ఇంటి తలుపులపై ఆడపిల్లల పేర్లు పెట్టాలనే ఆలోచన. నా ఆలోచనకు కార్యచరణ మొదలు పెట్టా. కల్మేశ్వర్ చుట్టూ ఉన్నా 18 గ్రామాల్లో 12 ఏళ్ల వయసు గల అమ్మాయిల పేర్లు సేకరించాం. ఇది ఒక ప్రయోగం. ఇంట్లో అమ్మాయిలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మా నమ్మకం. ఇదే విషయాన్ని గ్రామాల్లో తిరిగి ఇంట్లో వారికి అర్థం చేయించాం.  మా సలహాను వారి ఒప్పుకున్నారు. అలా 18 గ్రామాల్లో ఆ ఇంట్లోని బాలికల పేర్లతో నేమ్‌ప్లేట్ పెట్టుకున్నారు. ఇంటి తలుపులపై వారి పేర్లు చూడటం గర్వానికి చిహ్నంగా భావిస్తున్నాం. 

ఇంటి నుంచే మార్పు..

ఈ ప్రాజెక్ట్ గురించి గ్రామాల్లో వివరించే ముందే చాలామంది అనేక అనుమానాలు ఉండేవి. ఇలా ఎందుకు చేయాలి? చేస్తే మాకేంటి లాభం? అనే ప్రశ్నలు చాలా వచ్చాయి. వాళ్లకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించాం. ఉదాహరణకు ఇళ్లు పురుషుడి ఆస్తిగా పరిగణించబడుతుంది. సాధారణంగా భర్త తర్వాత ఇంటిపై భార్యకు హక్కు ఉంటుంది. అయితే మేం ఒక అడుగు ముందుకేసీ కుమారైలపై దృష్టి సారించాం. స్థానిక ప్రభుత్వాలు, పాఠశాలలు, గ్రామ పెద్దలను సంప్రదించాం. సమాజంలో ఆడపిల్లలు గౌరవంగా జీవించాలన్నా.. ప్రతిఘటించాలన్నా ముందు ఇంటి నుంచే మార్పు తీసుకురావాలి అని వివరించాం. మా ఆలోచన విధానం వారికి నచ్చడంతో అమలు చేశారు. 

ఆలోచన విధానంలో మార్పు..

ఈ మార్పు అనేది అన్ని స్థాయిల్లో రావాలి. బాలికల పేర్లతో నేమ్‌ప్లేట్ అనేది చిన్నతనం నుంచి ఆడపిల్లల ఆలోచన విధానంలో  మార్పును తీసుకొస్తుంది. ఎవరైనా ఇంటి తలుపుపై వారి పేర్లు చూసినప్పుడు, వారు కూడా దీన్ని అనుసరించాలా వద్దా అని ఆలోచిస్తారు!. అలాగే నిజమైన ప్రభావం చూపడానికి సాంస్కృతిక, సంస్థాగత స్థాయిలో కూడా మార్పును పెంపొందించాల్సిన అవసరం ఉంది. బాలికలు కేవలం పాఠశాలకు వెళ్లడం, అక్షరాస్యులుగా మారడం ద్వారా మాత్రమే ఆత్మవిశ్వాసం పెరగదు. ఈ కార్యక్రమం ఊహించిన దానికంటే సక్సెస్ అయింది. నేడు కల్మేశ్వర్ చుట్టూ ఉన్న 18 గ్రామాల్లో 2,100 నేమ్‌ప్లేట్లు ఉన్నాయి. ఫలితంగా బాలికలు తమ కుటుంబం, సమాజంలో తాము ఒక ముఖ్యమైన భాగమని నమ్మకంతో ముందడుగేస్తారు.