- రోజుకో చోట అడుగు జాడలు
- మొన్నటి వరకు ములుగు జిల్లాలో సంచారం
- తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పాదాల అచ్చులు
జనగామ, డిసెంబర్ 27: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. మొన్నటి వరకు ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగించగా.. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో ఎంట్రీ ఇచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పులి అడుగుజాడలు గుర్తించారు.
దీంతో అటవీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శుక్రవారం ఉదయం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో మిర్చి రైతులకు పెద్దపులి అడుగులు కనిపించాయి. అంతేకాకుండా దాని గాండ్రింపులు కూడా వినిపించడంతో పలువురు రైతులు పరుగులు పెట్టారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పగా వారు పాదముద్రలను పరిశీలించారు.
పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నది పెద్దపులేనని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ స్పష్టం చేశారు. కొమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం ఆరేగూడ సమీపంలోని కడంబ అటవీ ప్రాంతంలోనూ పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఎవరూ అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని, నాలుగు గంటలకు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.
ఒక్కటి కాదు మూడు!
నల్లబెల్లి మండలంలో కనిపించిన పులి అడుగు జాడలను గమనిస్తే ఇక్కడ రెండు పెద్దపులులతో పాటు ఒక పులి పిల్ల తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మండలంలోని రుద్రగూడెంలో పెద్దపులి అడుగులను గుర్తించడానికి ముందు కొండాపురంలోనూ పులుల పాదాల అచ్చులు కనిపించాయి.
వాటిని పరిశీలిస్తే ఆడ, మగ పులితో పాటు ఒక పిల్ల ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక్కడ మూడు పులులు కనిపించగా.. ఇందులో పెద్ద మగపులి రుద్రగూడెం వైపు వెళ్లినట్లుగా స్పష్టమవుతోంది.