కోలాహలం రామ్‌కిశోర్ :
మహారాష్ట్ర ఎన్నికల్లో కుటుంబసభ్యులు పరస్పరం ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలిచారు. క్రమంగా శత్రువర్గాలుగా మారారు. దూషణల పర్వం మొదలైంది. వావి వరసలు,రక్తసంబంధాలు, గౌరవ మర్యాదలు రాజకీయా ల్లో బలాదూర్. కుటుంబ సభ్యులు, అత్యం త సమీప బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ కత్తులు దూస్తున్నారు.
అనేక స్థానాల్లో తండ్రీ-కూతురు, భార్యా-భర్త, బాబాయ్- అబ్బాయ్ వైరి వర్గాలుగా ఎన్నికల రణరంగంలో పరస్పరం ఛాలెంజ్‌లు విసురుతూ బరిలో నిలిచారు. మరికొన్ని చోట్ల వీరు వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంగా మహా రాష్ట్ర ఎన్నికల్లో రక్తసంబంధీకుల పోరు రసవత్తరంగా సాగుతోంది.
బారామతిలో పవార్ పాలిటిక్స్
--------------------ఎన్సీపీ అధినేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ బారామతిలో పోటీ చేస్తుండగా, ఆయనపై సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) తరఫున తొలిసారిగా బరిలో నిలిచారు. ఇప్పటికే అజిత్ పవార్ బారామతిలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా విజయం సాధించారు. బారామతిలో ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా ఇలా ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై- అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేసి ఓటమి చెందారు. ఇక పొరుగునే ఉన్న కర్జత్- జంఖేడ్‌లో అజిత్ పవార్ మరో మేనల్లుడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) నుంచి బీజేపీకి చెందిన రామ్ షిండేను ఢీకొంటున్నారు.
తండ్రిపై కుమార్తె పోటీ
------------గడ్చిరోలి జిల్లాలో అహేరి నియోజకవర్గంలో తండ్రిపై కుమార్తె పోటీ చేస్తోంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్)తరపున తండ్రి బాబా ఆత్రమ్, నేష నలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) తరపున కుమార్తె భాగ్యశ్రీ ఎన్నికల బరిలో ప్రత్యర్థ్ధులుగా నిలిచారు.
మరోవైపు ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ జాదవ్ తన మాజీ భార్య, మాజీ కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దాన్వే కుమార్తె, శివసేన అభ్యర్థిని సంజనా జాదవ్‌తో తలపడుతున్నారు. అలాగే సంజనా జాదవ్ సోదరుడు సంతోష్ దాన్వే జాల్నాలోని భూకర్షన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశముఖ్‌లు కాంగ్రెస్ అభ్యర్థులుగా లాతూర్, లాతూర్ రూరల్‌లో ఉన్నారు. అలాగే మరో మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ రాణే కుమారులు నితీష్ రాణే, నీలేష్ రాణేలు కుడల్, కన్కవలీలా నుంచి శివసేన,బీజేపీ ఎంఎల్‌ఏ అభ్యర్థులుగా ఎన్నికల రణరంగ క్షేత్రంలో వైరి వర్గాలుగా నిలిచారు.
ఠాక్రేల మధ్య పోరు
---ముంబైలో ఠాక్రే సోదరులు వేర్వేరు సీట్లలో పోటీ చేస్తున్నారు. శివసేన (యూబీటీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వర్లీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి తరఫు బంధువు వరుణ్ సర్దేశాయి బాంద్రాలో రంగంలో ఉన్నారు. అలాగే ఆదిత్య సోదరుడు, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ముంబైలోని మహిమ్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీలోనూ దాయాదుల పోరు
మాజీ మంత్రి గణేశ్ నాయక్ అయిరోలిలో బీజేపీ నుంచి, ఆయన కుమారుడు సందీప్ సింగ్ బేలా పూర్‌లో ఎన్సీపీ (ఎస్సీ) నుంచి పోటీ చేస్తున్నారు. మాజీమంత్రి విజయ్ కుమార్ గేవిట్ నందూ ర్‌బర్‌లో బీజేపీ తరపున, ఆయన కుమా ర్తె, మాజీ ఎంపీ హీనా గేవిట్ స్వతంత్ర అభ్యర్థిగా అక్కల్కువలో బరిలో నిలిచారు.
ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ యెవలాలో పార్టీ తరపున, అతని మేనల్లుడు, మాజీ ఎంపీ సమీర్ భుజ్‌బల్ నందగావ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎన్సీపీ స్టేట్ చీఫ్ జయంత్ పాటిల్ ఇస్లాంపూర్‌నుంచి, ఆయన మేనల్లుడు ప్రజాక్తో తాన్పురే రాహురి నుంచి పార్టీ టికెట్లతో పోటీ పడుతున్నారు.
బీజేపీ ముంబై అధ్య క్షుడు ఆశిష్ షెలార్ బాంద్రా నుంచి, అత ని సోదరుడు వినోద్ షెలార్ మలాడ్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీనుంచి సంతుక్ రావు హంబార్డే పోటీలో ఉండగా, ఆయన సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్‌రావు హంబార్డే కాంగ్రెస్ నుంచి నాందేడ్ సౌత్ అసెంబ్లీ స్థానంలో రంగంలో ఉన్నా రు. కాంగ్రెస్ ఎంపీ వసంత్‌రావు చవాన్ మరణంతో నాందేడ్ లోక్ సభ ఉప ఎన్నిక ఈ నెల 20న జరుగుతుంది.
గత ఎన్నికల్లోనూ ఈ బంధువర్గాలు పరస్పరం కలహించుకొని కుటుంబ బాంధవ్యాలు, రక్తసంబంధాలు మరిచి ఎన్నికల పోరులో, బహిరంగ సభల్లో ఒకరి ఇంటిగుట్టు ఒకరు బయట పడేసుకున్నారు. ‘ఇంటి గుట్టు లంకకు చేటు’ అన్న ట్లు పోలీసులకు, ప్రత్యర్థులకు వారి గుట్టుకాస్తా చేరిపోయింది. కుటుంబాల పరువు రోడ్డు మీద పడింది. పత్రికలకూ పండగే. బూతుల పంచాంగంతో ఆసక్తి వర్గాలకూ మంచి కాలక్షేపం దక్కనుంది. ఈ నాయకుల ఇంటిగుట్టు రట్టు కావడంతో ప్రజ లకు సరదా కాలక్షేపం దక్కనుంది.
వ్యాసకర్త సెల్: 9849328496.