హక్కుల సాకారం.. దశాబ్దాల పోరాట ఫలితం
హైదరాబాద్, ఆగస్టు1 (విజయ క్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ... 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్న అంశం. 20 ఏండ్లుగా నిరీక్షిస్తున్న అంశం. ఎందరో నాయకుల, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ... తమ హక్కుల సాధన కోసం దబాద్దాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యానికి గురువారం సుప్రీం కోర్టు శుభం కార్డు వేసింది. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ప్రధానమైనది.
మందకృష్ణ మాదిగ దీనిని స్థాపించారు. 1994లో మొదలుపెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు. పాదయాత్ర చేస్తూ.. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా గురించి చైతన్యపరిచారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాం డ్ చేశారు. బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా ఏబీసీడీలుగా వర్గీకరించి నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ కోరారు. మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు.
మాల మహానాడు అభ్యంతరం
మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మొట్టమొదట మాలలు అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఇదిసామాజిక వైషమ్యాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పీవీరావు ఆధ్వర్యం లో ఏర్పడ్డ మాలమహానాడు ‘ఇది ప్రాంతీ య వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యా యం జరగలేదు’ అని వాదించారు. ‘మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి లబ్ది పొందే పథకాలుంటా యి. కానీ, మాలలకు ఆ అవకాశం లేదు’ అని మాల మహానాడు అన్నది. ఎస్సీలకు ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని విమర్శించారు. అంతేకాదు, ఇది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన ఉద్యమమని వారన్నారు. ఎందుకంటే, అప్పటికీ రాష్ట్రంలో మాలలు ఎక్కువ గా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయ సమీకరణాల్ని మార్చాలనేది ఆయన వ్యూహం అనే విమర్శ వర్గీకరణ వ్యతిరేకుల వైపు నుంచి బలంగానే వినిపించింది.
ఆ తర్వాత జరిగిందేంటి?..
మరోవైపు, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటాను ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటాను కేటాయించారు. ‘సీ’లో మాల, దాని ఉప కులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా ఇచ్చారు.
‘డీ’లో ఆది ఆంధ్రులతోపాటు మొత్తం 4 కులాలను చేర్చి వారికి 1 శాతం కోటాను నిర్ణయించిది. వీటిలో ఆనాటికి ఏ, బీ గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని, సీ, డీ గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ది పొందాయని కూడా గుర్తించారు. అయితే మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందనీ, రాజ్యాంగ విరుద్ధమైందనీ ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇదేం మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది. అలా వర్గీకరణ ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు పడింది.
అమలైన ఐదేళ్లు
ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్లు హేతుబద్దీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కే.ఆర్. నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలను కోటాలను నిర్ణయించారు. కానీ 2004 నవం బర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీం కోర్టు ప్రకటించింది. దాంతో పంచాయితీ మళ్లీ మొదటికే వచ్చింది.
ఈ ఐదేళ్ల కాలంలో మాదిగలకు 22 వేల వరకూ ఉద్యోగాలు వచ్చాయని మంద కృష్ణ తెలిపారు. ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిళ్లు పెరగటంతో 2004లో 2004లో వైఎస్సార్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2008 మేలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో రాజ్యాం గంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్‌ను ఆమోదించవచ్చని ఉషామెహ్రా సిఫార్సు చేశారు.
కానీ కేంద్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా గానీ, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా గానీ దాఖలాలు లేవు. 2014 ఎన్నికలప్పుడు... తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ హామీగానే ఉండిపోయింది. అయితే, ఇది ఎల్లకాలం అపరిష్కృతంగా ఉంటేనే రాజకీయ పార్టీలకు లాభమనే అభిప్రాయం కూడా బలంగా వినిపించింది.
ఇది అందరి సమస్య
వర్గీకరణ అంశం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు. పంజాబ్‌లో ఎస్సీ కోటాలో వాల్మీకి, మజహబీ సిక్కులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో చట్టాలుండేవి. ఆ తర్వాత వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. తమిళనాడులో జస్టిస్ ఎంఎస్ జనార్థనం నివేదిక ఆధారంగా, ఎస్సీలకున్నా 16 శాతం కోటాలో 3 శాతాన్ని అరుంధతీయార్ కులానికి కేటాయించారు. బీహార్‌లో కూడా ఎస్సీల్లో వెనుకబడ్డ కులాలను గుర్తించడం కోసం 2007లో మహా దళిత్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఆయా షెడ్యూల్డు కులాలకు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోటా దక్కడం లేదు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలతోపాటు రాజకీయల్లోనూ కొన్ని కులాలకే ఎక్కువ లాభాలు సమకూరాయి.
పైగా వీటిలో తేడాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం లో ఒక కులం నష్టపోతే, అదే కులం మరో రాష్ట్రంలో అధిక లబ్ధిపొందిన కులంగా ఉంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు నష్టపోయిన పక్షంగా ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిగలతో సమానమైన చమార్ కులస్థులు జనాభా దామాషాను మించి లబ్ధి పొందారు. కాబట్టి ఏ ప్రత్యేక కులానికీ దీనిపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించే ఉద్దేశం గానీ, అందుకు అవకాశం గానీ లేవు. దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొనే బహుజన్ సమాజ్ పార్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. దానికి కారణం స్పష్టమే. అలా చేస్తే రిజర్వేషన్ కోటాలో అధిక లబ్దిని పొందుతున్న కులాలను దూరం చేసుకోవటమే అవుతుంది.
ఏళ్ల నిరీక్షణకు తెర
2000-04 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది. హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేఖించింది. వివక్ష, వెనుకబడిన వాళ్లందరినీ ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి.
విభజన తర్వాత సమస్యలు
2014లో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కొత్త సవాళ్లు ముందుకు వచ్చాయి. వీటిలో ప్రధానమైనది. ఈ సమస్యకున్న ప్రాంతీయ స్వభావం. 2011 జనగణన ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో కలిపి, మాదిగ జనాభా మాల జనాభా కన్నా దాదాపు 17 లక్షలు అధికం. కానీఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కు. కాబట్టి తెలంగాణ, కోసాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాల, మాదిగల జనాభా నిష్పత్తి ఒకే విధంగా లేదు. మునుపటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో లబ్ది పొందింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాలలే తప్ప తెలంగాణ మాలలు కాదు అనేది మరో వాదన. ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా, తెలంగాణలో మాలలది, మాదిగలది విద్యా, ఉద్యోగాల్లో కొంచెం అటు ఇటుగా ఒకే పరిస్థితి అన్న వాదనను బలపర్చే లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో వర్గీకరణను బలంగా కోరుకున్న మాదిగల ముందు విభజన సమయంలో కొత్త సవాళ్లు తలెత్తాయి. వాటికి కొత్త పరిష్కారాలు వెదికే పరిస్థితి ముందుకొచ్చింది.
ఎమ్మార్పీఎస్ సాధించిందేంటి?
ఉద్యమానికి మందకృష్ణ, కృపాకర్ వంటి ఇద్దరు డైనమిక్ నేతలుగా ముందుకొచ్చారు. తమ పేర్ల చివర్లో మాదిగ అనే పదాన్ని చేర్చుకోవడం ద్వారా దాన్ని తమ ఆత్మగౌరవ ఉద్యమంగా కూడా మార్చారు. శాస్త్రి, శర్మ, రెడ్డి, రావు, నాయుడు, చౌదరి లాంటి కుల సూచక పదాలకు మాత్రమే గౌరవమర్యాదలు లభిస్తున్న సమాజంలో, అప్పటి దాకా అవమానానికి సూచికగా లేదా తిట్టుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చిన మాదిగ అనే పదాన్ని పేరులో సగర్వంగా నిలుపుకోవడం ఒక పెద్ద మార్పేనని చెప్పాలి.
ఆనాటి వరకూ తమను తాము మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు దాన్ని బాహాటంగా, నిస్సంకోచంగా చెప్పుకునే వాతావరణం కల్పించింది ఈ ఉద్యమమే అని విశ్లేషకుల అభిప్రాయం. అలాగే ఏబీసీడీ వర్గీకరణ అమలైన ఆ నాలుగేళ్ల కాలంలో మాదిగలకు సముచిత న్యాయం దక్కిందనేందుకు ఆధారాలున్నాయి. మంద కృష్ణ అందించిన వివరాల ప్రకారం.. ఆ ఐదేళ్ల కాలంలో మాదిగలకు దాదాపు 22 వేల ఉద్యోగాలు లభించాయి. అది అలాగే కొనసాగి ఉంటే సమన్యాయం దక్కి ఉండేదని ఆయన అభిప్రాయం. దీంతోపాటు అసెంబ్లీలో 45 ఎస్సీ స్థానాల్లో దాదాపు సగం సీట్లు దక్కాయి.
సుప్రీం తీర్పు హర్షణీయం: కేటీఆర్
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పును బీఆర్‌ఎస్ స్వాగతిస్తున్నది. ఈ విజయం వర్గీకరణ కోసం మాదిగలది. మా పార్టీ మొదటి నుంచీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చింది. మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం ఎస్సీలను రెండుగా చీల్చే ప్రయత్నం చేశా యి. మా పార్టీ మాత్రమే ఎస్సీ వర్గీకరణపై ఎప్పుడూ ఒకేలా స్పందించింది. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైన డిమాండ్ అని మా అధినేత కేసీఆర్ ఇప్పటికీ చెప్తారు. ఆయనే స్వయంగా సీఎం హోదాలో అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఎస్సీ వర్గీకరణ అవసరాన్ని వివరించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం రాష్ట్రాలకే వదిలివేయాలని కోరారు. దేశంలో ఎస్సీల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలి. బీఆర్‌ఎస్ ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తుంది.
మంచి ముందడుగు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం. తీర్పుతో రిజర్వేషన్ల విధానంలో ముందడుగు పడిం ది. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వారికి ఇక నుంచైనా రిజర్వేషన్ల ఫలాలు అందుతాయి. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాటినుంచి ఎస్సీ వర్గీకరణ కోరుతు న్నా. కలనెరవేరిన సందర్భంగా ఎ మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు అభినందనలు. మాజీ ఉప రాష్ర్టపతి
వెంకయ్య నాయుడు
స్వాగతిస్తున్నాం..
ఎస్సీ వర్గీకరణ అవసరమని నేను దశాబ్దాల క్రితమే నొక్కి చెప్పాను. దీనిపై 1996లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసింది. ఎస్సీ వర్గీకరణపై దేశంలో తొలిసారిగా ముందడుగు వేసింది టీడీపీ మాత్రమే. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. తీర్పు హర్షణీయం.
ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎస్సీ వర్గీకరణ తీర్పు చరిత్రాత్మకం
ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అను కూలం. వర్గీకరణకు మొదటి నుంచీ ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. వర్గీకరణను అమలు చేస్తామనిప్రకటిం చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.
బీజేపీ ఎల్పీ నేత
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సుప్రీం తీర్పును ‘మజ్లిస్’ స్వాగతిస్తోంది
ఎంఐఎంనేత అక్బరుద్దీన్ ఒవైసీ
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఎంఐఎం స్వాగతిస్తున్నది. స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకూ మేం అనుకూలం. కానీ ఇప్పటికే అమలులో ఉన్న సెట్విన్ వంటి స్వయం ఉపాధి పథకాలను రాష్ట్రప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు అవకాశం కల్పించాలి. చదువు పూర్తిచేసిన విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇక్కడ చదివి ఇతర దేశాలకు వెళ్లే అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
ఉద్యమ కల నెరవేరింది
ఎస్సీవర్గీకరణ కోసం 30 ఏండ్లు గా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ కలను సాకారం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వర్గీకరణపై అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం సముచి తం. కాంగ్రెస్ ప్ర భుత్వం వర్గీకరణకు అనుకూలం. మాల, మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్‌నిర్ణయం తీసుకుంటారు. మా ప్రభుత్వం త్వరలో కులగణన చేపడుతుంది.
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఉద్వేగానికి గురయ్యా: మంత్రి దామోదర
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉద్యమ నేత ఏళ్ల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణ 50 ఏళ్ల కల. అది నెరవేరినందుకు ఉద్వేగానికి గురయ్యా. వర్గీకరణ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు. అది సమ న్యాయం. సమ ధర్మం. సుప్రీంతీర్పుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం నడుచుకుంటుంది. వర్గీకరణ విషయంలో సహకరించిన సీఎంకు మాదిగ ఉప కులాల తరపున ధన్యవాదాలు.
సీఎం రేవంత్‌కు మిఠాయి తినిపించిన మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయ ణ, వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మన్, మందు ల సామెల్, కాలె యాదయ్య తదితరులు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో రేవంత్‌రెడ్డికి మిఠాయి తినిపించారు. అనంతరం సీఎం డబ్బు కొట్టి అభినందనలు తెలిపారు.
మందకృష్ణ మాదిగ అభినందనీయుడు..
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తూ ముఖ్యమంత్రి శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చర్చకు తీసుకరావడం అభినందనీయం. ఎస్సీ వర్గీకరణకు మొట్టమొదట మద్దతు తెలిపిన జాతీయ పార్టీ సీపీఐ. పోరాటంలో అంతిమంగా న్యాయమే గెలుస్తున్నదని సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ అభినందనీయుడు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
వర్గీకరణ తీర్పుకు బీజేపీకీ ఏ సంబంధం లేదు..
ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్లను వెనక్కి తీసుకొనైనా కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు.. బీజేపీకీ ఏ సంబంధం లేదు. వర్గీకరణ చేస్తామని మాదిగలను బీజేపీ మోసం చేసింది. పార్లమెంట్‌లో వర్గీకరణకు ఫుల్ మెజారిటీ ఉన్నా పార్లమెంటులో బిల్లు పెట్టలేదు.
డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
30 ఏళ్ల ఉద్యమం ఫలించింది..
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం 30ఏండ్లుగా చేస్తున్న ఉద్యమానికి ఫలితం దక్కింది. 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణ చేయొద్దని తీర్పునిచ్చింది. తాజాగా ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. కానీ వర్గీకరణ చేయొద్దనే విషయం దానిలో లేదు. ఆ ప్రకారం ఎవరికైనా రాజ్యాంగ ఫలాలు దక్కకపోతే వెంటనే చట్టం చేయాలి.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం
అమరుల ఆకాంక్ష నెరవేరింది..
వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా ఎదురు చూస్తున్న వారికి సుప్రీం కోర్టుతో న్యాయం జరిగింది. తీర్పుతో ఉద్యమం కోసం అసువులుబాసిన అమరుల ఆకాంక్ష నెరవేరింది. ఇక నుంచి ఎస్సీ ఉప కులాలైన బుడగ జంగాలు, మాస్తీలు, డక్కలి, సిందు జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి. న్యాయం గెలిచింది.
ఎమ్పార్పీఎస్ రాష్ట్రకమిటీ సభ్యుడు నలిమెల విజయరావు మాదిగ
సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైన డిమాండ్. రాష్ట్రాలకే అధికారం ఉందని సుప్రీం తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తున్నాం. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్న వర్గాలకు రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికైనా న్యాయం చేయాలి.
సీపీఐ హైదరాబాద్ నగర సహాయ కార్యదర్శి స్టాలిన్
రిజర్వేషన్ ఫలాలు అందని వారికి న్యాయం..
సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం. తీర్పుతో ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి న్యాయం జరుగుతుంది. ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అంశం కాదని కాలయాపన చేశాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఇక స్పష్టత వచ్చింది. వర్గీకరణ రాష్ట్రాల పరిధిలోని అంశమేనని తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వర్గీకరణ చేపట్టి, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలి.
ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, బషీర్‌బాగ్ లా పీజీ కాలేజీ ప్రిన్సిపాల్
కాలయాపన చేయొద్దు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పు సమర్థనీయం. రాష్ట్రప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలి. దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తున్నందున వాటిలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి.
మూడ్ శోభన్‌నాయక్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి