calender_icon.png 4 October, 2024 | 10:48 PM

ఏళ్లు గడిచినా తేలని ఎఫ్‌టీఎల్

05-09-2024 12:44:35 AM

  1. సిద్దిపేట కోమటి చెరువు శిఖంలో అక్రమ కట్టడాలు 
  2. ఇదే కోవలో పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం 
  3. సర్వే ఊసెత్తని రెవెన్యూశాఖ అధికారులు 
  4. చెరువు పరిరక్షణపై పట్టింపు లేని నీటిపారుదలశాఖ

సిద్దిపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణ అధికారుల ప్రాథమిక విధుల్లో ఒకటి. కానీ వారు తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అవి అన్యాక్రాంతమవుతున్నాయి. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలు వెలిశాయి. పట్టణానికి ఆనుకొని లేదా శివారులో కోమటి చెరువు, ఎర్ర చెరువు, చింతల చెరువు, వల్క చెరువులు ఉండగా, వీటిలో గత ప్రభుత్వం కోమటి చెరువు, ఎర్ర చెరువును అభివృద్ధి చేసింది.

కానీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ హద్దులు మాత్రం గుర్తించ లేదు. కోమటి చెరువు చుట్టూ నక్లెస్ రోడ్డు నిర్మించగా, ఆ రోడ్డు అంచున ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కట్టడాలు వెలిశాయి. ఇదే ప్రాంతం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం, ఓ ఫాం హౌస్‌తో పాటు పదుల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయి. కోమటి చెరువు పైభాగంలోని గణపతి కుంటను అనుకొని రియాల్ ఎస్టేట్ వ్యాపారు లు వెంచర్ చేశారు. కుంటపై భాగా న ఉన్న ఆరెవాని కుంట పూర్తి స్థాయిలో కబ్జాకు గురైం ది. అరెవాని కుంటలో ఇప్పుడు ప్రార్థన స్థలాలు, మున్సిపల్ కూరగాయల మార్కెట్ అందుబాటులోకి వచ్చాయి.

మిగతా స్థలంలో స్థానికులు ఇం డ్లు నిర్మించారు. వాటికి 58, 59 జీవో ద్వారా ప్రభుత్వ ధ్రువపత్రాలు సైతం పొం దారు. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లూ చేయించుకున్నారు. కొన్నిచోట్ల ఏకం గా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం దేనికి సంకేతం? ఆరెవాని కుంట రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డుల్లో నమోదు లేదు. మామిడి కుంట, బుడ్డకుంట, కాళ్లకుంటకు సంబంధించిన విస్తీర్ణం, సర్వే నంబర్లునా రెవెన్యూశాఖ వద్ద రికార్డులు లేకపోవడం గమనార్హం. సర్వే చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు తేల్చే తీరిక కూడా ఆ శాఖకు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

సర్వే చేస్తే తెలుస్తుందని ఉవాచ.. 

కోమటి చెరువు ఆక్రమణపై సిద్దిపేట అర్బన్ తహసీల్దార్, సిద్దిపేట ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా తాము ఇటీవల బదిలీపై వచ్చామని, చెరువు అన్యాక్రాంతమైన విషయం తమకు తెలియదని సమాధా నమిచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ తేల్చేందుకు సర్వే చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఆక్రమణలపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

పట్టించుకోని రెండు ప్రభుత్వశాఖలు

ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, నాళాలు, శిఖం భూముల సంపూర్ణ బాధ్యత రెవెన్యూ, నీటిపారుదలశాఖలది. గ్రామస్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు ఉన్న నీటివనరులను ఈ శాఖల అధికారుల పర్యవేక్షించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు ఏటా చెరువులు, కుంటలను సర్వే చేసి ఎఫ్‌టీఎల్ (పూల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ పరిధి గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు.

రెండు శాఖల వద్ద జిల్లాలో ఎన్ని చెరువులు? ఎన్ని కుంటలు? ఎన్ని చెక్ డ్యాంలు? ఎంత పరిధిలో ఉన్నాయనే రికార్డులు లేవు. కొన్ని కుంటలకు సర్వే నంబర్లే లేవు. మరికొన్ని కుంటలు, చెరువులకు సంబంధించి అసలే రికార్డులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు అర్బన్ పరిధిలో మొత్తం 95 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో ఏ కుంట ఎక్కడుందో రెండు శాఖల అధికారులకు తెలియదనడం విధుల పట్ల వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.