calender_icon.png 19 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలితమివ్వని ప్రజావాణి

19-11-2024 12:33:28 AM

  1. అర్జీలు ఇచ్చినా పరిష్కారం శూన్యం
  2. పట్టింపుచుకోని అధికారుల
  3. నాలుగు నెలల కాలంలో 3,808 అర్జీలు
  4. పెండింగ్‌లో ఉన్నవి 1,541

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అర్జీలు సమర్పించినా పరిష్కారం కావడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం నూటికి నూరుశాతం గిరిజన జిల్లా కావడంతో అత్యధికంగా భూ సమస్యలపైనే అర్జీలు వస్తుంటాయి.

కాని వాటిని పరిష్కరించే నాథుడే లేడని ప్రజావాణి నివేదిక తేటతెల్లం చేస్తోంది. గడచిన నాలుగు నెలల కాలంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై మొత్తం 3,808 అర్జీలు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 2,267 అర్జీలకు పరిష్కారం లభించింది.

1,541 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో జిల్లా కలెక్టరేట్ విభాగంలోనే అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ప్రజావాణిలో పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. 

మొక్కుబడిగా అధికారుల హాజరు

ప్రజావాణి కార్యక్రమానికి కొందరు అధికారులు మొక్కుబడిగా వస్తున్నట్లు ఆరోపణులున్నాయి. జిల్లా కలెక్టర్ నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. అత్యవసర పనులుంటే ముందస్తుగా కలెక్టర్ అనుమతి తప్పని సరిగా పొందాలి. కానీ అనేక సందర్భాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులే ప్రజావాణికి వచ్చి వెళ్తున్నారు. వారు కూడా ప్రజావాణిని సక్రమంగా నిర్వహించరనే విమర్శలున్నాయి. 

శాఖల వారిగా..

కలెక్టరేట్‌లోని బి సూపరింటిండెంట్‌కు 415 అర్జీలు వస్తే ఇప్పటి 249 పరిష్కారం అయ్యాయి. 166 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏకు 84 అర్జీలు వస్తే 8 మాత్రమే పరిష్కరించబడ్డాయి. ఇంకా 76 పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌కు 55 అర్జీలు వస్తే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు.

కలెక్టరేట్ డినసెక్షన్ సూపరింటిండెంట్‌కు 64 అర్జీలు వస్తే 25 మాత్రమే పరిష్కరించారు. 39 పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టరేట్ లీగల్ సెల్‌కు 47 వస్తే 8 మాత్రమే పరిష్కారం అయ్యాయి, 39 పెండింగ్‌లో ఉన్నాయి. డీఆర్‌డీఏకు 64 అర్జీలు వస్తే 16 పరిష్కరించండ్డాయి, 48 పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్‌ఓఎఫ్‌ఆర్ డిప్యూటీ తహసీల్దార్‌కు 112 అర్జీలు వస్తే 7 మాత్రమే పరిష్కరించబడ్డాయి. 105 పెండింగ్‌లో ఉన్నాయి.