calender_icon.png 26 October, 2024 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే స్వేచ్ఛాయుత వాతావరణం

26-10-2024 01:46:51 PM

కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పోలీసుల త్యాగాల వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నమని కలెక్టర్ జితేస్వీ వి పాటిల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సూచనల మేరకు శనివారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ నుండి ప్రారంభమై ముర్రేడు వాగు బ్రిడ్జి, గణేష్ టెంపుల్, సూపర్ బజార్, బస్టాండ్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రామవరం మీదుగా రుద్రంపూర్ పార్క్ వరకు సాగింది.

ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, ఓఎస్డి సాయిమనోహర్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, కొత్తగూడెం 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, 3టౌన్ సీఐ శివప్రసాద్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి,ఆర్ఐలు రవి, సుధాకర్, కృష్ణారావు మరియు ఎస్సైలు,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.ఎంతో ఉత్సాహంగా  ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని సుమారుగా 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏదైనా సరే నిత్యం ప్రజలకు సేవలందిస్తూ,శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతూ అహర్నిశలు కష్టపడేది పోలీస్ శాఖ అని అన్నారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉగ్రవాదుల నుండి, విద్రోహక శక్తుల నుండి మనల్ని కాపాడుతూ ఎంతోమంది  పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని  అన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని, ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ  ఇలాంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తం గడ్డ కట్టే చలిలో దురాక్రమణలను అడ్డుకొని దేశం కోసం తమ ప్రాణాలనర్పించిన పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మరువకూడదని అన్నారు.

దేశ అంతర్గత భద్రతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఏడాది ఉగ్రవాదుల చేతుల్లో, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. వారందరిని స్మరించుకుంటూ ఈ నెల 21 నుండి 31 వరకు ఈ సంస్మరణ కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలియజేసారు. విధి నిర్వహణతో పాటు పోలీసు అధికారులు సిబ్బంది తమ ధైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.