calender_icon.png 5 April, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి తుడుపుగా కరెంటు సమస్యల ఫోరం వేదిక!

28-03-2025 01:04:30 AM

  • ఫోరం సభ్యుల ముందే రైతులపై విద్యుత్ అధికారుల బెదిరింపులు

కనీసం నిలువ నీడ తాగునీరు కూడా ఏర్పాటు చేయని అధికారులు

ఫిర్యాదులు చేసేందుకు భారీగా తరలివచ్చిన రైతులు

నాగర్ కర్నూల్ మార్చి 27 ( విజయక్రాంతి ) సుదీర్ఘ కాలం పాటు సమస్యలతో సతమతమవుతున్న విద్యుత్ వినియోగదారుల నుండి దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ వేదికను గురువారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ముందు కంటితుడుపుగా నిర్వహించారు.

చాలాకాలం పాటు ఆయా విద్యుత్ సమస్యలతో బాధపడుతున్న రైతులకు విద్యుత్ వినియోగదారుల ఫోరంపై  అవగాహన కల్పించి వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఆయా వేదికల ద్వారా సమాచారం అందుకొని ఫోరం వద్దకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతులను వారి ముందే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి నిరీక్షిస్తున్నామని ఫోరం దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారులు బ్రోకర్ల అవతారంలో తమ నుంచి డబ్బులు తీసుకుని పనిచేయడం లేదని ఆరోపించారు. నేరుగా డీడీలు కట్టినా లంచాలు ఇవ్వకపోవడంతో కొర్రీలు పెడుతూ పనులు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరి కొంతమంది చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఫిర్యాదులు అందాయి. ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనుల్లోనూ రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రైవేటు వారికి గంటల వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్లు అందిస్తున్నారని రైతులకు మాత్రం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదని మండిపడ్డారు.

మొత్తంగా 150 ఫిర్యాదులు అందాయని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.  కానీ అధికారులు మాత్రం నిలువ డానికి నీడ తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు మండిపడ్డారు.  సిజిఆర్‌ఎఫ్ చైర్మన్ నాగేశ్వరరావు, సభ్యులు రామానుజ నాయక్, వెంకట్ తదితరులు రైతుల నుంచి వెనతులను స్వీకరించారు. వారితోపాటు ఎస్సీ బాలరాజు, టెక్నికల్ డిఈ రవికుమార్, ఎస్ ఏ ఓ పార్థసారథి డి ఈ శ్రీధర్శెట్టి తదితర మండలాల ఏఈలు ఉన్నారు.