calender_icon.png 8 October, 2024 | 8:29 AM

నిబంధనలకు విరుద్ధంగా జప్తు చెల్లదు

04-09-2024 01:37:19 AM

రైస్ మిల్లర్ల పిటిషన్లపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పౌరసరఫరాల శాఖకు అప్పగించకపో వడంతో నష్టపరిహారాన్ని రాబట్టుకోవడంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా చేసిన జప్తు చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకునే ముందు చట్టప్రకారం అనుసరించాల్సిన విధానం ఉందని, దానికి వ్యతిరేకంగా చేసిన జప్తు చెల్లదని చెప్పింది. చట్ట నిబంధనలను అనుసరించి మిల్లర్ల నుంచి నష్టాన్ని ప్రభుత్వం రాబట్టుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిం చింది.

సీఎంఆర్ అప్పగించలేదన్న కారణంగా ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాదాపు 10కి పైగా రైస్ మిల్లుల యజమాననులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టగా మిల్లర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్‌ఎన్ హేమేంద్ర నాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెండుమూడేళ్లుగా పంట దిగుబడులు ఎక్కువ కావడంతో మిల్లుల సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువ ధాన్యాన్ని మిల్లుల్లో దించి వెళ్లారన్నారు.

అప్పటికే మిల్లింగ్ చేయలేకపో వడంతో ధాన్యం మిల్లులో నిండిపోయిందన్నారు. అక్కడ తడిచిన ధాన్యం నాసిరకంగా తయారై పాడైందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం రవాణా, మిల్లింగ్ చార్జీలను గత కొన్నేళ్లుగా చెల్లించలేదని చెప్పారు. ప్రభు త్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మిల్లర్ల నుంచి రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్ల దాకా వసూలు కావాల్సి  ఉందన్నారు. 

బియ్యాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్తులను జప్తు చేసినట్టు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి .. రెవెన్యూ రికవరీ చట్టం కింద మిల్లర్ల నుంచి బియ్యం విలువను రాబట్టే ముందు నిబంధనలు పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తుల జప్తు చేయడం చెల్లదంటూ తీర్పు వెలువరించారు.