calender_icon.png 27 September, 2024 | 6:53 AM

గ్లోబల్ ట్రెండ్స్‌పై దృష్టి

23-09-2024 12:00:00 AM

ఈ వారం స్టాక్ సూచీల గమనంపై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15:  యూఎస్ ఫెడ్ పండ్స్ కమిటీ మార్కెట్ అంచనాల్ని మించి  వడ్డీ రేట్లను అరశాతం తగ్గించడంతో పలు ప్రధాన ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. ఈ వారం సైతం ఇన్వెస్టర్లు గ్లోబల్ ట్రెండ్స్‌పైనే దృష్టి నిలుపుతారని, అందుకు అనుగుణంగానే మన మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ కేంద్ర బ్యాంక్ పావుశాతం మేర రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్లో ఉండగా, గతవారం జరిగిన సమీక్షలో వడ్డీ రేటును ఫెడ్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈక్విటీలు పరుగు తీశాయి. సెన్సెక్స్ గతవారం తొలిసారిగా 84,000 పాయింట్ల స్థాయిని అధిగమించి, 84,694 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.   ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25,849 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

రేట్ల కోతతో పాజిటివ్ సెంటిమెంట్

యూఎస్‌లో వడ్డీ రేట్ల కోత జరిగిన ప్రతీ సందర్భంలోనూ వర్థమాన మార్కెట్లపై సానుకూల ప్రభావం పడినట్లు గత గణాంకాలు వెల్లడిస్తున్నాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతం భారత్ మార్కెట్‌పై అమితాసక్తి ఉన్నందున, దేశీయంగా పాజిటివ్ సెంటిమెంట్ నెలకొన్నదని తెలిపారు. గత శుక్రవారం ఒక్కరోజునే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా రూ.14,000 కోట్ల నిధుల్ని పెట్టుబడి చేశారు.

ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ ఈ వారం మార్కెట్ కదలికలకు కీలకమని విశ్లేషించారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదన్న ఆందోళనలు తగ్గడంతోపాటు విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నందున ఈ వారం మార్కెట్ క్రమేపీ పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ ఖెమ్కా అంచనా వేశారు. 

ఒడిదుడుకులుంటాయ్

ఈ వారం దేశీయ మార్కెట్ కదలికల్ని గ్లోబల్ సంకేతాలు నిర్దేశించ నున్నప్పటికీ, సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగింపు కారణంగా ఒడిదుడుకులు నెలకొంటాయని విశ్లేషకులు హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి మార్కెట్లు భౌగోళిక రాజకీయ రిస్క్‌లను పట్టించుకోవడం లేదని, అవి రానున్న రోజుల్లో బుల్లిష్ మూమెంటంను దెబ్బతీసే అవకాశం ఉంటుందని సంతోష్ మీనా హెచ్చరించారు. ఎఫ్‌పీఐ ట్రేడింగ్ యాక్టివిటీతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ కదలికలు, అంతర్జాతీయ క్రూడ్ ధరలు కూడా ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.33,700 కోట్లు

యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెలలో 20వ తేదీవరకూ దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ.33,700 కోట్లు నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి నెల తర్వాత విదేశీయుల పెట్టుబడులు ఈ నెలలోనే అధికంగా తరలివచ్చాయి.  ఏప్రిల్, మే నెలల్లో రూ. 34,000 కోట్ల మేర వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీఐలు జూన్ నుంచి క్రమేపీ భారత మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతున్నారు.

అయితే యూఎస్ వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎఫ్‌పీఐల పెట్టుబడుల శైలిని ప్రభావితం చేస్తాయన్నారు.  రానున్న రోజుల్లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల ట్రెండ్ కొనసాగుతుందని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అంచనా వేశారు. ఫెడ్ భారీగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గించడం, యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 3.7 శాతానికి దిగిరావడంతో భారత్‌తో సహా ఇతర వర్థమాన మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.