అభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే ఆర్మూర్ కు రావద్దు...
అర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి(MLA Rakesh Reddy)పై వెలసిన పోస్టర్లు కళకలం రేపుతోంది. నందిపేటలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ఏడాదికాలంగా అభివృద్ధి చేయని ఎమ్మెల్యే నియోజకవర్గానికి రావద్దంటూ తొమ్మిది ప్రశ్నలతో కూడిన వాల్ పోస్టర్లను అంటించారు. రూపాయి ఆసుపత్రి ఎక్కడ, యువతకు ఉపాధి ఎక్కడ, ఏడాదిలో ఊరికి పది ఇల్లు సొంతంగా కట్టిస్తున్నావు అవి ఎక్కడ, హిందువులంటూ రెచ్చగొట్టి విరాళాలు ఇచ్చిన ఆలయలేవి, హైదరాబాదులో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దు అంటారు, ఎందుకు పేదవారు అంటే చులకన ఎమ్మెల్యేకి, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే యువతను పంపుతా అంటూ వారి సమాచారం తీసుకొని ఆగం చేస్తున్నావ్, ప్రభుత్వ అధికారులతో దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు, ధనవంతులు రావద్దు అంటావ్ పేదవారు వస్తే సహాయం చేయవు అంటూ తొమ్మిది ప్రశ్నలతో కూడిన పోస్టర్లను అతికించారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు చెక్కర్లు కొడుతున్నప్పటికీ అర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో బుధవారం తెల్లవారుజామున ఈ పోస్టర్లు వెలిశాయి.
వీటిని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాను అందరికంటే ఎక్కువ తెలుసని అందరికంటే బాగా మాట్లాడుతానని ముద్ర వేసుకునేందుకు ఉబలాటపడుతున్న రాకేష్ రెడ్డి పదవిలోకి వచ్చి ఏడాది దాటుతున్న నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తన సొంత పనుల కోసం సమయాన్ని కేటాయిస్తూ ప్రజాపాలనను గాలికి వదిలేసారని ఆరోపిస్తున్నారు. గెలిచిన తర్వాత హైదరాబాదులో రూపాయికే వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారనే బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే వాల్ పోస్టర్లను బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు అతికించినట్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలను వదిలి పెట్టాలని పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు. ఇదిలా ఉంటే తమ నాయకుడిపై పోస్టర్లు ఎలా అతికిస్తారంటూ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు కలగజేసుకొని అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను మరో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ప్రజలే పోస్టర్లు అతికిస్తే తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడం విడ్డూరమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ప్రశ్నించకూడదని ప్రశ్నించారు. ఒక రూపాయికి వైద్యం చేయిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశాడని, గ్రామానికి 10 ఇళ్ల చొప్పున సొంత ఖర్చులతో కట్టిస్తానని మాట ఇచ్చి మాట తప్పిన ఎమ్మెల్యేను ప్రశ్నించకూడదని మండిపడ్డారు. తమ కార్యకర్తలను విడిచిపెట్టాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ఆయన పోలీసులను హెచ్చరించారు.