calender_icon.png 29 December, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసించిన విద్యారంగం!

29-12-2024 01:54:46 AM

  1. గతానికి విభిన్నంగా అడుగులు
  2. విద్యాశాఖ బలోపేతం, వేగంగా నియామకాలు 
  3. ఉద్యోగార్థులు, ఉద్యోగుల్లో చిగురించిన ఆశలు
  4. ఏళ్లతరబడి సమస్యలకు ఏడాదిలో పరిష్కారాలు

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఈ ఏడాదంతా విద్యారంగం విభిన్నంగా సాగింది. గతంకంటే ఈసారి విద్యావ్యస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సరికొత్త నిర్ణయాలు, మార్పులు చేర్పులు చేసుకుంటూ 2024లో విద్యారంగం వికసించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన కొన్ని సమస్యలకు ఈ ఏడాది పరిష్కారమార్గాలను చూపించింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని లక్ష్యంతో విద్యా బోధనకు సరిపడా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తీ చేసింది.

11,062 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి నియామక ప్రక్రియను సాఫీగా పూర్తి చేసింది. పదో తరగతిలో జీపీఏ విధానాన్ని రద్దు చేసి, వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది.

బదిలీలు, పదోన్నతులు, ఎంఈవోల నియామకం..

పాఠశాల విద్యపై పర్యవేక్షణ కొరవడడంతో విద్యారంగం దెబ్బతిన్నది. బాధ్యతా యుతమైన పర్యవేక్షణతోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచొచ్చని భావించిన విద్యాశాఖ రాష్ట్రంలోని 600కుపైగా మండలాలకు ఎంఈవోలను నియమించింది. అదేవిధంగా సుమారు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను ఏడాదిలోనే పూర్తి చేసింది.

ప్రభుత్వం ప్రత్యేక చొరవతో న్యాయస్థానాల్లో అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఫలితంగా 21,419 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు.

దీంతోపాటు గత పదేళ్లలో బదిలీలు పొందని టీచర్లను నిబంధనలకు అనుగుణంగా ట్రాన్ఫర్ చేశారు. ఈ ఏడాదిలోనే మొత్తం 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 2,757 మోడల్ స్కూల్ టీచర్లు బదిలీలు పొందారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.

పోస్టులు పెంచి పరీక్షల నిర్వహణ..

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు పెంచి టీచర్ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసింది. ఉద్యోగాల భర్తీలో ఈ ఏడాది కొత్త రికార్డును నమోదు చేసింది. మొదటి ఏడాదిలో దాదాపు 55వేల ఉద్యోగ నియమకాలు చేపడితే.. అందులో డీఎస్సీకి సంబంధించి 11,062 పోస్టులు ఉండటం విశేషం. ఈ తరహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గత పదేళ్లలో వేయలేదు.

అదేవిధంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. భవిష్యత్తులో సాఫీగా ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు విడుదల చేసేలా టీజీపీఎస్సీ సంస్కరణల అమలుకు అడుగులు వేసింది. వివిధ పోటీ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలను అందజేసి సర్కారు కొత్త సంప్రదాయానికి తెర తీసింది.

గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగిపోయిన నిరుద్యోగులు.. బదిలీలు, పదోన్నతులు లేక విలవిల్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఈ ఏడాది ఆశలు చిగురింపజేసిందని చెప్పవచ్చు. అయితే అంతా మంచే జరిగిందని కూడా చెప్పలేం.

317 జీవో బాధితుల సమస్య ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. పెండింగ్ బకాయిలు, పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. వీటిపైన కూడా ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుంని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

రెండుసార్లు టెట్.. 

ఈ ఏడాదిలోనే రెండుసార్లు టెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గత డీఎస్సీకి ముందు ఒకసారి పరీక్ష నిర్వహించగా నవంబర్‌లో మరో టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 2 నుంచి జరగనున్నాయి. ఇకపై ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రెండో టెట్ నోటిఫికేషన్‌ను వేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. కాగా జనవరి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. 

ఉద్యోగాల ఏడాదిగా..

2024ను ఉద్యోగ నియామకాల ఏడాదిగా చెప్పవచ్చు. ఈ ఏడాదిలోనే దాదాపు వివిధ శాఖల్లో కలిపి 55వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కలను ప్రభుత్వం సాకారం చేసింది. గత పదేళ్లలో తీసుకోని నిర్ణయాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేసింది. ఏడాది పొడవునా.. రిక్రూట్‌మెంట్‌లు, నియామకపత్రాలు అందజేసి తొలి ఏడాదినే ఉద్యోగాల ఏడాదిగా మార్చారు.

యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను తీసుకొచ్చి ఏడాది పొడవునా ఉద్యోగ మేళాను ప్రకటించారు. పేపర్ లీకేజీలతో అపవాదు మూటగట్టుకున్న టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్స్ పరీక్షలన్నీ సాఫీగా జరిగాయి. గత ప్రభుత్వంతో రద్దయినవి.. వాయిదా పడ్డవి..పెండింగ్‌లో పెట్టిన ఫలితాలన్నీ సర్కారు విడుదల చేసింది. 

కొత్త వీసీలు, చైర్మన్లు..

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఈ ఏడాది చివరలోనే కొత్త వీసీలొచ్చారు. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం లభించింది. టీజీపీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త చైర్మన్‌గా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించారు.

అంతే కాకుండా తెలంగాణ ఉన్నత విద్యామండలికి నూతన చైర్మన్‌గా ప్రొ.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొ.పురుషోత్తంను నియమించారు. విద్యాశాఖ కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళిని, మిగతా సభ్యులు, సలహామండలి నియామకం జరిగింది.

వీటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. అలాగే వచ్చే విడ్యా సంవత్సరంలో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలను తీసుకొచ్చేందుకు ఈ ఏడాదిలోనే అడుగులు పడ్డాయి.