calender_icon.png 23 September, 2024 | 4:59 AM

చిన్నబోతున్న పరిశ్రమ

23-09-2024 02:46:11 AM

తగ్గిపోతున్న ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్లు

పదేండ్లలో అతి తక్కువగా 175కు తగ్గుదల

2021-22లో అత్యధికంగా 3,974 నమోదు

ఎంఎస్‌ఎంఈలు పెంచడమే లక్ష్యంగా ‘పాలసీ’

తెలంగాణ ఇండస్ట్రీస్ హెల్త్ క్లినిక్‌తో పునరుద్ధరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సుస్థిర సమగ్రాభివృద్ధి సాధిం చడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. అలాంటి ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని తాజా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.

ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు నుంచి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ల సంఖ్య గరిష్ఠంగా 3,974కి చేరుకుంది. కానీ, గత మూడేళ్లుగా ఈ రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత తక్కువగా ఇప్పటివరకు 175 రిజిస్ట్రేషన్లే నమోదు కావటం గమనార్హం.

2014 తర్వాత మళ్లీ ఇప్పుడే

తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 151గా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా ఏటా పెరుతూనే వచ్చా యి. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్ర పంచమంతా అల్లకల్లోమైనా ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్లపై ఆ ప్రభావం పడలేదు. ఆ సమయంలోనే ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3,974 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. తర్వాతి ఆర్థిక సంవత్సరం నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,061 నమోదుకాగా, 2023-24లో 2,622 నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 175కు దిగజారిపోయింది. 

ఎంఎస్‌ఎంఈలు పెంచడమే ‘పాలసీ’ లక్ష్యం

ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటికి చేయూతనిచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రారంభించింది. ప్రస్తుత పాలసీతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఎంఎస్‌ఎంఈల ఎదుగుదలకు సహకారం అందిస్తూనే కొత్త ఎంఎస్‌ఎంఈలు స్థాపించేలా ప్రోత్సహిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఎంఎస్ ఎంఈలకు సౌకర్యవంతమైన భూమిని అందించడం, రుణ సదుపాయాన్ని సులభతరం చేయడం, ముడి సరుకులను అందు బాటులో ఉంచడం, మార్కెట్‌లో కార్మికులకు వ్యాపార మెళుకువలపై అవగాహన పెంచడం, నూతన సాంకేతికతను అందించడం, వ్యాపారాన్ని మెరుగుపరచడం, విస్తరించడం వంటి సదుపాయాలు పెంచేందు కు చర్యలు తీసుకుంటుంది. 

‘ఇండస్ట్రీస్ హెల్త్ క్లినిక్’తో ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణ

తెలంగాణలో గత మూడేళ్లుగా ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మూతపడుతున్న ఎంఎస్‌ఎంఈల అంశం లో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో రాష్ట్రాలవారీగా మూతపడిన ఎంఎస్‌ఎంఈల గణాంకాలను పరిశీలిస్తే... తెలంగాణ అతి తక్కువ ఎంఎస్‌ఎంఈలు మూతపడిన రాష్ట్రంగా నిలిచింది. మూడేళ్లలో రాష్ట్రంలో 231 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మాత్రమే మూతపడ్డాయి.

హర్యానాలో 558, కర్ణాటకలో 804, గుజరాత్‌లో 1,626, తమిళనాడులో 2,456, మహారాష్ట్రలో అత్యధికంగా 5,082 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. తెలంగాణలో ఎంఎస్‌ఎంఈల మూసివేతను నియంత్రించడంలో 2018లో ప్రారంభించిన తెలంగాణ ఇండస్ట్రీస్ హెల్త్ క్లినిక్ కీలకంగా పనిచేసిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా 1,340 యూనిట్లకు సేవలను అందించింది. 2024 మార్చి వరకు 115 యూనిట్లను పునరుద్ధరించగలిగింది. 

పదేళ్లలో రూ.31 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణ ఏర్పాటు నుంచి రాష్ట్రంలో మొత్తం 24,303 ఎంఎస్‌ఎంఈలు రిజిస్టర్ అయ్యాయి. ఇం దులో టీజీ-ఐపాస్ కింద దాదాపు 22 వేల కొత్త ఎంఎస్‌ఎంఈలకు అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నది. ప్రభుత్వ డాటా ప్రకారం గత పదేళ్లలో 19,954 ఎం ఎస్‌ఎంఈలు మొత్తం రూ.31,023 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించాయి. టీజీ-ఐపాస్‌లో నమోదైన ఎంఎస్‌ఎంఈలు 2018 లో సగటున రూ.కోటి పెట్టుబడిని అందుకున్నాయి. ఈ పెట్టుబడి స్థాయి 2022 సంవత్సరానికల్లా సగటున రూ.2.15 కోట్లకు పెరిగింది.