- పేపర్ లీక్‌లపై విద్యామంత్రికి పట్టింపే లేదు
- లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ విమర్శలు
- గట్టిగా అరిస్తే అబద్ధం నిజం కాబోదు
- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్
- లోక్‌సభలో అధికార, విపక్షాల మాటల యుద్ధం
న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటు బడ్జెగ్ సమావేశాల తొలిరోజే లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య జోరుగా మాటయుద్ధం నడిచింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మధ్య వాగ్వాదం నడిచింది. సభలో నీట్ అంశాన్ని లేవనెత్తిన రాహుల్.. మన పరీక్షల నిర్వహణ వ్యవస్థలోనే లోపం ఉన్నదని విమర్శించారు.
‘నీట్ ఒక్కటే కాదు.. దాదాపు అన్ని ప్రధాన పరీక్షల నిర్వహణలోనూ లోపం ఉన్నదని దేశం మొత్తం భావి స్తున్నది. మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) ఆయనకు ఆయన తప్ప ప్రతిదాన్నీ (నీట్ పేపర్ లీక్‌పై) విమర్శిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందన్నదానిపై ఆయనకు ప్రాథమిక విషయాలు కూడా తెలుసునని నేను అనుకోవటం లేదు. డబ్బు ఉంటే, ధనవంతులైతే పరీక్షల వ్యవస్థనే కొనేయొచ్చని లక్షలమంది భారతీయులు నమ్ముతున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే అనుకొంటున్నాయి’ అని పేర్కొన్నారు.
అరిస్తే అబద్ధం నిజం కాదు
రాహుల్‌గాంధీ విమర్శలను ధర్మేంద్ర ప్రధాన్ తిప్పికొట్టారు. గత ఏడు సంవత్సరాల్లో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని తెలిపారు. ‘గత ఏడేండ్లలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. నీట్ అంశం సుప్రీంకోర్టు ముందు ఉన్నది. నీట్ అమల్లోకి వచ్చిన తర్వాత 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని పూర్తి బాధ్యతతో చెప్పగలను’ అని పేర్కొన్నారు. అందుకు స్పందించిన రాహుల్‌గాంధీ.. సమస్యను పరిష్కరించటానికి ఏం చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి.. ‘గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజం కాదు.
దేశ పరీక్షల వ్యవస్థే చెత్త అని విపక్ష నేత అంటున్నారు. ఇది తీవ్ర గర్హనీయం. పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. యూపీఏ ప్రభుత్వం కూడా నాడు ఈ బిల్లును తెచ్చింది. కానీ, ఒత్తిళ్లకు తలొగ్గి పక్కన పెట్టింది’ అని విమర్శిం చారు. ధర్మేంద్ర ప్రధాన్‌పై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా విరుచుకుపడ్డారు. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.