calender_icon.png 6 April, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి

20-03-2025 01:57:23 AM

డిప్యూటీ డిఎంహెచ్‌ఓ హామీతో ధర్నా విరమణ

మంచిర్యాల, మార్చి 19 (విజయక్రాంతి) : ఆశా వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆశ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సమ్మక్క, శోభలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సంవత్సరం గడిచిన అమలు చేయడం లేదని, ఇప్పటికే దఫ దఫాలుగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, రాష్ట్ర కమిషనర్ కి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్ ఢ్ వేతనం రూ. 18 వేలు నిర్ణయించి చెల్లించాలని, డిసెంబర్ నెలలో రాష్ట్ర కమిషనర్  ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలని, అర్హులైన ఆశాలను ఏఎన్‌ఎంలుగా ప్రమోట్ చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్   మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల పట్ల వ్యవహరిస్తున్న విధానాలు సరైంది కాదని, పేద ప్రజల కొరకు నిరంతరం పనిచేసే ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదని, పిఎఫ్,ఈ.ఎస్.ఐ, కనీస వేతనం లేదని, శ్రమదోపిడికి గురి చేస్తుందన్నారు.

రెండు గంటల పాటు ఆందోళన

పోలీసులు భారీ గేట్లు పెట్టి ఆశ వర్కర్లను ఎవరిని లోపటికి పంపకపోవడంతో సుమారు రెండు గంటలు ఆశా వర్కర్లు బయట ఎండలో నిల్చోని ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో అనిత గేటు బయటకు ఆశ వర్కర్ల దగ్గరికి వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర కమిషనర్ దృష్టికి తక్షణమే తీసుకెళ్తానని, స్థానిక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ బిల్లులపై తక్షణమే సమీక్షించి వెంటనే విడుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాణి, కవిత, అరుంధతి, సుజాత, సువర్ణ, ప్రకాష్, సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి దూల శ్రీనివాస్, మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్, జిల్లాలోని ఆశ వర్కర్లు పాల్గొన్నారు.