ఢిల్లీ: ఢిల్లీలోని మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అన్నారు. కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు జరిగే లబ్దిని కేంద్రమంత్రి వివారించారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని, ఇది వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు అని కిషన్ రెడ్డి తెలిపారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని అలాగే పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ అని కొనియాడారు. ఆదాయపన్ను విషయంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) సర్కార్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నదని, రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొవిడ్(Covid), తర్వాత యుద్దాల వల్ల చాలా దేశాల్లో ఆర్థికవ్యవస్థలు ఒడిదొడుకులు ఉన్నాయని, ఎంఎస్ఎంఈలకు కూడా ఇది ఎంతో మేలు చేసే బడ్జెట్ అని చెప్పారు. కేంద్రం అమలు చేసే అన్ని పథకల్లో తెలంగాణ(Telangana) కూడా భాగస్వామిగా ఉంటుందని, ఎంఎస్ఎంఈలకు కేటాయించిన నిధులతో తెలంగాణకు కూడా లాభం చేకురుతుందని తెలిపారు. 50 ఏళ్ల వరకు వడ్డీరహిత రుణాలతో తెలంగాణకు కూడా లబ్ది కలుగుతుందన్నారు. అమృత్ పథకంతో 125 పట్టణ, స్థానిక సంస్థలకు లబ్ది చేకురుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.