వికారాబాద్, మే 17 (విజయక్రాంతి) : తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్ చెమ్ జిప్సం ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్లో కలిపే ముడి సరుకు ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. పనులు నడుస్తుండగా షాట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో పనిచేస్తున్న కార్మికులు విషయం గమనించి పరుగులు తీశారు. ఎంత సేపటికి మంటలు అదుపులోకి రాకపోవడంతో కొడంగల్, వికారాబా ద్ల నుంచి అదనంగా ఫైర్ ఇంజన్లు తెప్పించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో మూడు జేసీబీలు, ఇతర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల గ్రామాలు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సుమారు రెండు కోట్ల నష్టం జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు.