- నిజామాబాద్ వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ
- హాజరైన సీఎం రేవంత్, ఇతర నేతలు
- తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
- కాంగ్రెస్‌లో డీఎస్ కుటుంబానికి తగిన స్థానం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
నిజామాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అంత్యక్రియలు నిజాబాద్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. శనివారం గుండెపోటుతో మరణిం చిన ఆయన పార్ధివ దేహాన్ని నిజామాబాద్ తరలించారు. ఆదివారం ప్రజల సందర్శనార్ధం కొద్దిసేపు ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. డీఎస్ కుటుంబసభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా డీఎస్ సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత నేత డీ శ్రీనివాస్ పాత్ర మరచిపోలేనిదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో ఆయన తీసుకున్న చొరవ ప్రత్యేకమైనదని తెలిపారు. డీఎస్ సూచనల మేరకే సోనియాగాంధీ 2004లో జరిగిన కరీంనగర్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో డీఎస్ క్రమశిక్షణ గల కార్యకర్త అని, ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు 10 నమ్మకం గల వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని డీఎస్ కాంగ్రెస్ అధిష్ఠానానికి నొక్కి చెప్పారని తెలిపారు.
మహాకూటమి ఏర్పాటు, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీఎస్ చొరవే కారణమని, అది నచ్చి 2009లో సైతం మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. డీఎస్ కాంగ్రెస్‌కు దూరమై బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాక, పార్లమెంటు సెంటల్ హాల్‌లో కలిస్తే శ్రీను హౌఆర్‌యూ అంటు సోనియా ఆప్యాయంగా పలకరించారని, ఆయన కాంగ్రెస్‌లో లేరని తాను చెప్పినా శ్రీను మన మనిషి అని సోనియా అన్నారని వెల్లడించారు.
నేతలను తయారుచేసిన డీఎస్
నిజామాబాద్ జిల్లాలో డీఎస్ ప్రోత్సాహంతో అనేక మంది బలహీనవర్గాల వారు రాజకీయంగా ఎదిగారని సీఎం తెలిపారు. మధుయాష్కి, ఈరవత్రి అనిల్ లాంటివారు ఇందుకు ఉదాహరణ అని రేవంత్ తెలిపారు. డీఎస్ మృతికి సోని యా, రాహల్ సంతాపం తెలిపారని, పార్లమెంటు, ఇతర కార్యక్రమాలతో బిజీ గా ఉండటంతో అంత్యక్రియలకు రాలేకపోయారని చెప్పారు. డీఎస్ కుటుంబం కాం గ్రెస్ కుటుంబమని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
డీఎస్ కుటుంబ సభ్యులను సచివాలయానికి పిలిచి చర్చించి, వారి ఆకాంక్ష మేరకు డీఎస్ స్మృతి చిహ్నం నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. అంత్యక్రియ ల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బోధ న్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కి గౌడ్, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయుకులు పాల్గొన్నారు.