calender_icon.png 28 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలకూ సందేశాన్నిచ్చిన చిత్రం

28-11-2024 01:14:41 AM

జీవన సంధ్యలో ఉన్న కన్నవారిని వదిలేసి కాసుల వేటలోనో.. మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే కొడుకుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక తల్లిదండ్రుల చెంత ఉన్నా వారి ఆలనా పాలనా చూడని బిడ్డలను చూస్తున్నాం. ఎంత సంపాదించినా.. ఎన్ని పూజలు చేసినా ‘మాతా పితరుల సేవను మించిన మాధవ సేవ’ లేదని చాటి చెప్పిన చిత్రమే ‘పాండురంగ మహత్స్యం’. ఇది 1957 నవంబర్ 28న విడుదలైంది.

ఎన్టీఆర్, అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. బి.సరోజా దేవి, నాగయ్య, కస్తూరి శివరావు, పద్మనాభం, రుష్యేంద్రమణి, ఛాయాదేవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమరావు నిర్మించారు. ఆపాత మధురంగా ఈ చిత్రం నాటి ప్రేక్షక లోకాన్ని తన్మయత్వంలో ముంచెత్తింది.

‘అమ్మా అని అరిచినా ఆలకించవేవమ్మా, హే కృష్ణా ముకుందా మురారి’ వంటి పాటలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ నట వైదుష్యాన్ని చాటి చెప్పిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. మహారాష్ట్రలోని పుండరీక క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పే చిత్రమిది. శోత్రీయ కుటుంబానికి చెందిన పుండరీకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. జల్సారాయుడిగా ఉండే పుండరీకుడి వ్యసనాలు అతడిని ఎంతటి దురవస్థల పాల్జేస్తాయో చూపించే చిత్రమిది. నాటి జనాలకే కాకుండా భావితరాలకు సైతం సందేశాన్నిచ్చే చిత్రమిది.