‘గోపాలుడు భూపాలుడు’ 1967, జనవరి 13వ తారీఖున విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో మెప్పించారు. గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్ భావనారాయణ, వైవీ రావు నిర్మించిన ఈ సినిమాకు జీ విశ్వనాథం దర్శకత్వం వహించారు. ఎస్పీ కోదండపాణి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీ రామారావు సరసన జయలలిత, రాజశ్రీ నటించగా, రాజనాల, పద్మనాభం కీలక పాత్రలు పోషించారు.
శాపం కారణంగా తోబుట్టువులు ఒకరినొకరు చంపుకొనే రాజవంశం కథతో రూపొందిందీ సినిమా. ఏడు తరాలుగా కొనసాగుతున్న మరణాల పరంపరకు ఎలా శుభం కార్డు పడిందన్నది ఆసక్తిగా ఉంటుంది. రాజవంశంలో పెద్దవాడైన రాజు తన తమ్ముడి చేతిలో హత్యకు గురవుతాడు. కవలలకు జన్మనిచ్చిన ఆ రాజు భార్య.. రాజవంశంలో తరతరాలుగా అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నట్టే తన కడుపున పుట్టిన కవలల్లో ఎవరో ఒకరే మిగులుతారని భయపడిపోతుంది.
అలా జరగొద్దని భావించిన రాణి కవలల్లో ఒకరిని తన సేవకురాలికి అప్పగిస్తుంది. ఆ బాలుడిని తీసుకొని రాజ్యానికి దూరంగా వెళ్తూ అడవి దారిలో ఆ సేవకురాలు పులికి బలైపోవటం, ఆ బాలుడు గొర్రెల కాపరి మంగమ్మ వద్దకు చేరడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
అటు అంతఃపురంలో భూపాలుడు, ఇటు గొర్రెల కాపరి గోపి.. ఒకే తల్లి బిడ్డలన్న సంగతి ఎలా తెలిసింది? ఒకే పోలికతో ఉన్న వాళ్లిదరినీ కలిపిన సందర్భం ఏంటి? సొంత వ్యక్తుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో చక్రవర్తి, గొర్రెల కాపరి ఒకరి స్థానంలోకి ఒకరు చేరి వేసిన ఎత్తులు ఏంటి? అన్నదమ్ములిద్దరికీ ఒకే రూపం ఉన్న కారణంగా మారువేషంలో ఆ ఇద్దరూ పడ్డ పాట్లు ఏంటి అనే విషయాలన్నీ వినోదభరితంగా ఉంటాయి.