27-02-2025 01:39:10 AM
కరీంనగర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మునుపెన్నడు లేని విధంగా కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను మరిపించింది. ప్రధాన ప్రత్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. నేడు జరగనున్న పోలింగ్ లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కడతారో చూడాలి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 15 మంది బరిలో ఉన్నారు.
నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. కౌంటింగ్ మార్చి 3 న అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నాలుగు నెలల కాలం నుండి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మూడు బహిరంగ సభల్లో పాల్గొనగా, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రతి ఓటరును ట చేసిన నరేందర్ రెడ్డి పట్టభద్రుల మద్దతు తనకే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ చాపకింద నీరులా ప్రచారం నిర్వహించారు. ఆయన సైతం గెలుపు ధీమాలోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థి చెన్నమైల్ అంజిరెడ్డి గెలుపు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారంలో మునిగి తేలినప్పటికి అంజిరెడ్డి ఆలస్యంగా ఎంటరై ప్రచారంలో వెనుకబడ్డారు.
పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనలేకపోయింది. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచిన ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్ రావు ప్రచార సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పటికి తన ప్రయత్నాలను విరమించుకోకుండా విస్తృత ప్రచారం చేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ కేసీఆర్ ఫోటోతో ప్రచారం నిర్వహించారు.
మరో ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతి ముస్తాక్ అలీ మైనార్టీ ఓట్లు తనవైపే ఉంటాయన్న ధీమాతో ప్రచారం నిర్వహించారు. ఇలా ఒకరి పై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహించి పట్టభద్రులు తమవైపే ఉంటారు, తమదే గెలుపు అన్న ధీమాలో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది పోటీలో ఉన్నప్పటికి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్డీయూ మద్దతుతో బరిలో దిగిన వంగ మహేందర్ రెడ్డి హోరాహోరీ ప్రయత్నాలు చేశారు.
ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్లయిన ఉపాధ్యాయులకు పోటీపడ్డ అభ్యర్థులు డబ్బులు పంచారన్న ప్రచారం బుధవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేటి ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.