calender_icon.png 2 February, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎం.ఈ.ఎస్ ప్రొబెషనరీ అధికారుల బృందం క్షేత్రస్థాయి అధ్యయనం

01-02-2025 10:33:52 PM

అదనపు కలెక్టర్ తో భేటీ..

నిజామాబాద్ (విజయక్రాంతి): తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ కు కేటాయించబడిన మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం శనివారం జిల్లాకు చేరుకుంది. 30 మందితో కూడిన అధికారుల బృందం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ అంకిత్ తో ఆయన ఛాంబర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయి అధ్యయనం సందర్భంగా వివిధ వర్గాల వారి కోసం అమలవుతున్న కార్యక్రమాల తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి క్లుప్తంగా వారికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, డివిజన్, జిల్లా స్థాయి కేంద్రాలుగా అధికార యంత్రాంగం పరిపాలన కొనసాగుతుందని వివరించారు.

నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున 70 నుండి 80 శాతం మంది ప్రజలు సాగు రంగంపైనే ఆధారపడి జీవనాలు సాగిస్తారని అన్నారు. శ్రీరాంసాగర్, అలీసాగర్ వంటి జలాశయాలతో పాటు జిల్లాలో పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న జీవనది గోదావరిని ఆధారంగా చేసుకుని వివిధ రకాల పంటలు సాగు చేస్తారని, వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న అధిక విస్తీర్ణంలో పండిస్తారని వివరించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు తదితర వారి పనితీరును క్షేత్రస్థాయి సందర్శనలో పరిశీలించాలని సూచించారు. కాగా, 30 మందితో కూడిన అధికారులను ఆరు బృందాలుగా విభజిస్తూ ఒక్కో బృందానికి ఒక గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం కోసం కేటాయించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, సుంకెట్, దొన్కల్, నందిపేట మండలంలోని సిద్దాపూర్, వన్నెల్(కె), వెల్మల్ గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొబేషనరీ అధికారులతో కూడిన బృందాలు ఈ నెల 08 వ తేదీ వరకు క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ భేటీలో డీఆర్డీఓ సాయాగౌడ్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.