calender_icon.png 18 January, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా

18-01-2025 01:00:56 AM

రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం

  • ఖేల్త్న్ర స్వీకరించిన గుకేశ్, మనూ, హర్మన్, ప్రవీణ్
  • అర్జున అవార్డు అందుకున్న దీప్తి, జ్యోతి

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల వేడుక శక్రవారం రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. 2024 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును నలుగురు అందుకున్నారు. ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ పాటు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న స్వీకరించారు.

గతేడాది నవంబర్‌లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన గుకేశ్ (18 ఏళ్లు) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇక మనూ బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్య పతకాలు కొల్లగొట్టింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పురుషుల హాకీ జట్టు కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ విజయం వెనుక కీలకపాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఖేల్ రత్న అందుకున్నాడు. అంతేకాదు నలుగురు హాకీ ఆటగాళ్లు అర్జున పురస్కారాలు సాధించారు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ పారిస్‌లో దానిని స్వర్ణంగా మార్చాడు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ దీప్తి జివాంజి, అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున పురస్కారం అందుకున్నారు. వరంగల్‌కు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో కాంస్యంతో మెరిసింది.

మొత్తం 32 మంది అర్జున అవార్డు స్వీకరించగా.. అందులో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. ద్రోణాచార్య అవార్డును ముగ్గురు అందుకోగా.. లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) పురస్కారాలు స్వీకరించారు. అర్జున అవార్డ్ లైఫ్ టైమ్ కేటగిరీలో సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారం పెట్కర్ (పారా స్విమ్మింగ్) అవార్డులు అందుకున్నారు.