calender_icon.png 16 April, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనువు చాలించిన తండ్రి.. అనాథలను చేసిన తల్లి

16-04-2025 12:54:54 AM

  1. ప్రభుత్వ వసతి గృహంలో ఆవాసం
  2. వేసవి సెలవుల్లో తలదాచుకునేది ఎక్కడ?
  3. అపన్నహస్తం కోసం పిల్లల ఎదురుచూపులు

పాపన్నపేట, ఏప్రిల్ 15:పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఓ కుటుంబంతో విధి వింత నాటకం ఆడింది. తోటి చిన్నారులతో తుళ్లుతూ... నవ్వుతూ ఆడుకోవాల్సిన ఆ చిన్నారుల జీవితాల్లో తీరని విషాదం అలుముకుంది. ప్రమాదవశాత్తు తండ్రి తనువు చాలించడంతో పిల్లల పోషణ భారంగా భావించిన తల్లి వారిని అనాథలుగా చేసి వెళ్ళిపోయింది.

అమ్మానాన్నలతో హాయిగా సాగాల్సిన బాల్యం ఎవరు లేక దిక్కుకోచని స్థితిలో చిన్నారుల జీవితాలు దిక్కులేని వారిగా మారాయి. పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ఈ చిన్నారుల గాథ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

అనారోగ్యంతో తనువు చాలించిన తండ్రి

పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన భూతిపురం రవికి టేక్మాల్ మండలం సాలోజిపల్లికి చెందిన సంపూర్ణతో వివాహం జరిగింది. వారు మొదటి నుండి పేదవారు అయినప్పటికీ గ్రామంలో దొలికిన కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. వారి కి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.

ఇలా కాపురం సాఫీగా సాగుతున్న క్రమంలో తండ్రి అనారోగ్య కారణాల వల్ల తనువు చాలించాడు. పిల్లల పోషణ భారంగా భావించిన తల్లి సైతం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి ఎటో వెళ్ళిపోయింది. తల్లి, తండ్రి లేని పిల్లలను కాలనీకి చెందిన వారు ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు.

ప్రస్తుతం వేసవి సెలవులు సమీపిస్తున్న క్రమంలో పిల్లల భవిష్యత్తుపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరుగు పొరుగు వారు చేసిన సహకారంతో ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహాల్లో వారి జీవనం, విద్యాభ్యాసం కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో వచ్చే వేసవి సెలవులు వారి స్థితిగతిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు...

గ్రామంలోకి వెళ్తే ఉండేందుకు ఇళ్లు సైతం లేదు. తండ్రి ఉన్న కాలంలో ఏర్పా టు చేసుకున్న చిన్న గుడిసెలో తల దాచుకునేండుకు సైతం కనీస సౌకర్యాలు లేవు, సౌకర్యాల కల్పన కోసం ఎవరిని అడగాలి, ఎక్కడ తలదాచుకోవాలి అనేది అర్థంకాకుండా ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన వీరి కుటుంబానికి కనీసం గుంట భూమి సైతం లేదు.

ఉన్న గుడిసెలో సైతం ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. వీరిని ఆదుకునేందుకు గాను మానవతావాదులు, సేవాభావం కలిగిన వారు ముందుకు వస్తే బాగుంటుందనే విన్నపం గ్రామస్థుల నుం డి ఉత్పన్నమవుతుంది. ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా అడుక్కునే పరిస్థితులు రాకూడదంటే వారి సంక్షేమం కోసం దాతలు సహాకరించాల్సిన అవసరం ఉంది. 

కాలనీకి చెందిన కొందరు గ్రామస్థులు ఆ పిల్లలకు సహాయ సహాకారాలు అందించే దాతల కొసం ప్రయత్నిస్తున్నారు. చిన్నారుల మనుగడ కోసం తోచిన సహాయ సహకారాలను అందించి ఆదుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అనాధ బాలల కోసం ప్రభుత్వం సైతం చొరవ చూపి వారికి వసతి గృహాల్లో నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా అవకాశం కల్పించి ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించాలనికోరుతున్నారు.