calender_icon.png 13 October, 2024 | 3:43 AM

ప్రముఖ ట్రేడింగ్ కంపెనీ పేరుతో నకిలీ యాప్

10-10-2024 12:00:00 AM

మహిళతో పెట్టుబడులు పెట్టించి 16.50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ప్రముఖ ట్రేడింగ్ సంస్థ పేరును వాడుకొని, నకిలీ వివరాలతో ఓ బాధితురాలిని మోసం చేసి రూ. 16.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ మహిళా ఉద్యోగికి మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానం అందింది.

అయితే, ఆమెకు గతంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ప్రముఖ సంస్థలో పెట్టుబడి పెట్టిన అనుభవం ఉంది. ఈ రెండు ఒకే సంస్థకు చెందినవనీ స్కామర్లు ఆమెను నమ్మించి మొత్తం రూ. 16.50 లక్షలను పెట్టుబడులుగా పెట్టించారు. తర్వాత స్కామర్లు అదనంగా మరో రూ. 29 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు.

ఆమె చెల్లించకపోతే ఇప్పటికే పెట్టుబడి పెట్టిన రూ. 16.50 లక్షలు కోల్పోవాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు గతంలో ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డీల్ చేస్తున్న అరవింద్‌ను సంప్రదించింది. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ అనే యాప్‌తో తమ కంపెనీకి సంబంధం లేదని అతడు చెప్పాడు. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన మహిళ బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.